సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
చలి తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఆదిలాబాద్,నవంబర్23(జనంసాక్షి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు, సలహాలతో పాటు వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వైద్య సిబ్బందిని కోరారు. చలి పెరగడంతో స్వైన్ తదితర వ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో చలి విపరీతంగా పెరగడంతో పాటు అక్కడక్కడ విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్బిణులు ఎన్ని పరీక్షలు చేయించుకున్నది, ఎన్ని టీటీ ఇంజక్షన్లు , బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పీహెచ్‌సీలలో పరిశుభ్రత లోపిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చలి పెరుగుతున్నందున టీబీ, క్షయ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సిబ్బంది సూచించారు. నేషనల్ రూరల్ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రావిూణ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు రక్తహీనత గుర్తించి వారికి మందుగోళీలు అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పరీక్షలు చేయాలన్నారు. తగ్గిపోతున్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి అవగాహన సదస్సులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.