సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి.

వైద్య, ఆరోగ్య సిబ్బందికి సూచించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్
నంగునూరు, జూలై12(జనంసాక్షి):
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మండల పరిధిలోని వైద్య సిబ్బంది మొత్తం అప్రమత్తమై వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ అన్నారు. మంగళవారం నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసారు. అనంతరం మాట్లాడుతూ.. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు తగిన సలహాలు, సూచనలు చేయాలని తెలిపారు. ప్రతిరోజు ప్రజలకు  అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన  చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజలకు గుర్తు చేయాలని కోరారు. అంతకుముందు ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికతో పాటు ల్యాబ్, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, వార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి తనిఖీ సందర్భంగా డాక్టర్ బాల నర్మెట్ట గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ ను పరిశీలించేందుకు వెళ్లారని సిబ్బంది చెప్పారు. తనిఖీలో భాగంగా మొదటిసారి ఆస్పత్రికి వచ్చిన డిఎంహెచ్ఓను స్థానిక సిబ్బంది శాలువాతో సన్మానించారు.