సీబీఐకి షాక్‌ ఇచ్చిన చిదంబరం

– కేసు చార్జిషీటును సీబీఐ లీక్‌ చేసిందంటూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన చిదంబరం

న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : ఎయిర్‌సెల్‌ – మాక్సిస్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సీబీఐకి షాక్‌ ఇచ్చారు. ఈ కేసులో ఛార్జిషీటును విూడియాకు సీబీఐ లీక్‌ చేసిందంటూ ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలనే ఆసక్తి సీబీఐకి ఏమాత్రం లేదని ఆయన ప్రత్యేక కోర్టులో వేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. ఛార్జిషీటులో పేర్కొన్న వ్యక్తులకు ఇప్పటికీ ఆ కాపీ ప్రతులను ఇవ్వలేదని, అయితే ఛార్జిషీటులో వివరాలను విడతలవారీగా ఒక వార్తాపత్రికకు మాత్రం సీబీఐ లీక్‌ చేస్తోందని ఆయన అన్నారు. దీంతో చిదంబరం తన దరఖాస్తులో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలంటూ సీబీఐకి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేశారు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో జూలై 19న సీబీఐ దాఖలు చేసిన కొత్త ఛార్జిషీటులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సహా పలువురు రిటైర్డ్‌, సర్వీసులో ఉన్న ప్రభుత్వ అధికారుల పేర్లు చేర్చింది.