సీబీఐ నూతన డైరెక్టర్‌గా..  మన్నెం నాగేశ్వరరావు

– రాత్రికి రాత్రే  ఉత్తర్వులు జారీ
– వెంటనే విధుల్లో చేరిన మన్నెం నాగేశ్వరరావు
– అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాను సెలవుపై పంపిన ఉన్నత వర్గాలు
– నిర్ణయంపై సుప్రింను ఆశ్రయించిన అలోక్‌ వర్మ
– 26న విచారణ చేపడతామని వెల్లడించిన న్యాయస్థానం
– బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రక్షాళన ప్రారంభించిన మన్నెం
– 13మంది సీబీఐ అధికారుల బదిలీ
– సీబీఐ అధికారుల ఆఫీసుల్లో సోదాలు
– భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి మన్నెం
– మన్నెం నియామకంతో స్వగ్రామం బోర్‌నర్సాపూర్‌లో సంబురాలు
న్యూఢిల్లీ, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ప్రక్షాళన ప్రారంభమైంది. ఆమేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం విధుల నుంచి తప్పించింది. వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు మౌఖిక ఆదేశాలు జారీచేశాయి. సీబీఐ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో నాగేశ్వరరావు వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే బాధ్యతలు చేపట్టిన వెంటనే మన్నెం నాగేశ్వరరావు తన మార్క్‌ ను చూపించారు. 13మందిని బదిలీ చేశారు. రాకేష్‌ ఆస్తానా, అలోక్‌ వర్మ బృందాల్లో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని బదిలీల్లో టార్గెట్‌ చేసింది. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ సాయి మనోహర్‌ను చండీగఢ్‌కు బదిలీ చేశారు. రాకేష్‌ ఆస్థానా కేసు దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అధికారులను సీబీఐ బదిలీ చేశారు. సీబీఐ బదిలీలు చేసిన సీనియర్‌ అధికారుల్లో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ,  అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ గుర్మ్‌, డీఐజీ మనీష్‌ కుమార్‌ సింగ్‌, ఏసీబీ డీఐజీ తరుణ్‌ గౌబా, డీఐజీలు జస్బీర్‌ సింగ్‌, అనిష్‌ ప్రసాద్‌, కేఆర్‌ చురాసియా, రామ్‌ గోపాల్‌, ఎస్పీ సతీష్‌ దగార్‌, అరుణ్‌ కుమార్‌ శర్మ, ఏ సాయి మనోహర్‌, వి. మురుగేశన్‌, అమిత్‌ కుమార్‌లున్నారు. మొత్తం 13 మంది అధికారులను సీబీఐ బదిలీ చేసింది.
అదేవిధంగా మన్నెం ఆధ్వర్యంలో సీబీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సీబీఐ ప్రధాన
కార్యాలయంలోని 10,11 అంతస్తులను పూర్తిగా సీజ్‌ చేసిన అధికారులు సోదాలు నిర్వహించారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ తనిఖీలు జరిపినట్లు తెలిసింది. ఉదయం 9గంటల వరకు కార్యాలయంలోకి ఇతరులెవరినీ అనుమతించలేదు. ప్రస్తుతం అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాల ఆఫీసులను అధికారులు సీజ్‌ చేసి సోదాలు జరిపారు. బుధవారం ఉదయం సీబీఐ కార్యాలయానికి వచ్చిన అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాలను వారి ఛాంబర్లకు వెళ్లనీయకుండా అధికారులు అడ్డుకున్నారు. అంతేగాక.. వారికి డ్రైవర్లను కూడా తొలగించారు. అలోక్‌, ఆస్థానా సన్నిహిత అధికారులను కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం.
సుప్రింను ఆశ్రయించిన అలోక్‌వర్మ..
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం.. సీబీఐ డైరెక్టర్‌ బాధ్యతలను జాయింట్‌ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించింది. రాత్రికి రాత్రే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే కేంద్ర నిర్ణయాన్ని అలోక్‌ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.
తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది.
తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావు..
1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా కేడర్‌ అధికారి. ఒడిశాలో డీజీ ¬దాలో పనిచేశారు. ఏప్రిల్‌ 7, 2016 నుంచి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ రామారావు తర్వాత ఆ ¬దా చేపట్టిన తెలుగు అధికారి ఈయనే కావడం విశేషం. ఇదిలా ఉంటే మన్నెం నాగేశ్వరరావు అరుదైన అవకాశం దక్కించుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని చేపట్టారు. దీంతో ఆయన స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు మన్నం పిచ్చయ్య, శేషమ్మలకు ఆయన రెండో సంతానం. నాగేశ్వరరావుకు ఓ అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదివిన ఆయన… తిమ్మంపేటలో పదో తరగతి వరకూ చదివారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఏవీవీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివి తరువాత సీకేఎం కళాశాలలో డిగ్రీచేశారు. ఉస్మానియాలో పీజీ చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్‌ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఒడిశా కేడర్‌లో ఐపీఎస్‌గా చేరినా.. ఎక్కువకాలం ఛత్తీస్‌గఢ్‌లో పని చేశారు. ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు. దక్షిణాది రాష్ట్రాల జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తరువాత ఆస్థానంలో నాగేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను సీబీఐ నూతన డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. నాగేశ్వరరావు కృషి, దీక్ష, అంకితభావమే ఆయన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి సీబీఐ డైరెక్టర్‌ స్ధాయికి తీసుకెళ్లిందని బంధువులు
సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగేశ్వరరావు సచ్ఛీలుడేం కాదు –  సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు సచ్ఛీలుడేవిూ కాదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. నాగేశ్వరరావుపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.