సీబీఐ వివాదంపై సుప్రింలో..  మరో పిటీషన్‌ దాఖలు


– కోర్టును ఆశ్రయించిన సీబీఐ డిప్యూటీ ఎస్పీ
న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. తనను బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా లంచం కేసులో తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆస్థానాపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే దీనిపై శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆయన చేసిన విన్నపాన్ని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. స్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై విచారణ జరుపుతున్న సీబీఐ ఉన్నతాధికారుల్లో బస్సీ కూడా ఒకరు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బస్సీని అండమాన్‌ దీవులకు బదిలీ చేస్తున్నట్టు గత బుధవారం సీబీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులపైనా బదిలీ వేటు వేశారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ ఆదేశాలతోనే బస్సీ తనపై ‘పొంతనలేని ప్రశ్నలు వేస్తూ దర్యాప్తు’ చేస్తున్నారంటూ ఆస్థానా సీవీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్మ, ఆస్థానాలను దీర్ఘకాలిక సెలవుపై పంపుతూ, మరికొందరిపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.