సీమాంధ్ర వలసవాద దురహంకారం
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సినిమా
పూరీజగన్నాధ్ కార్యాలయంపై దాడి
తెలంగాణ ధర్మాగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 19 (జనంసాక్షి):
మళ్లీ అదే దురహంకారం..దశాబ్దాలుగా తెలంగాణ భాష, యాసను అవమానిస్తున్న సీమాంధ్ర వలసవాద దురహంకారులు మరోసారి అదే బుద్ధిని ప్రదర్శించిండ్రు..తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఓ సినిమాను తీసి జనాల మీదకు తోసేశారు..తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా చూపిండ్రు..తెలుగు తల్లి అంటూ పేరు మార్చి తెలంగాణ ఉద్యమంపై విషం కక్కారు..ఉద్యమాల పేరుతో విద్యార్థులను, ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ రచ్చచేెశారు..అంతే తెలంగాణవాదులు భగ్గుమన్నారు..తెలంగాణ వ్యాప్తంగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రదర్శనకు బ్రేక్ వేశారు…అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండు చేశారు. అంతేగాక ఆ చిత్రం
దర్శకుడు, నిర్మాత, హీరో పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరారు. దీనిపై టీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది..తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఉద్యమ తీరును కించపరిచేవిగా పలు సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని వాటిని తొలగించాలని అప్పటివరకు తెలంగాణ జిల్లాల్లో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని టిఆర్‌ఎస్వీ హెచ్చరించింది. ప్రత్యేక తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా సినిమా తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.టిఆర్‌ఎస్‌వి పిలుపు నేపథ్యంలో శుక్రవారం ఉదయం తార్నాకలోని ఆరాధన థియేటర్ లోకి దూసుకువెళ్ళిన కొందరు విద్యార్థులు సినిమా రీళ్ళను తీసుకువెళ్ళారు. అదేవిధంగా నల్గొండ, నటరాజ్ థియేటర్ వద్ద ప్రదర్శనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. సినిమా దర్శకుడు, నిర్మాత, హీరో పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పేంతవరకు ప్రదర్శనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. నకిరేకల్‌లోని రామకృష్ణ థియేటర్ వద్ద ప్రదర్శనను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోను సినిమా ప్రదర్శన అడ్డుకున్నారు. అలాగే వరంగల్‌లోని ఆరు సినిమా థియేటర్ల వద్ద తెలంగాణ వాదులు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రదర్శనను అడ్డుకున్నారు. హన్మకొండలోనూ అదే పరిస్థితి కొనసాగింది. అంతేగాక హీరో పవన్‌కళ్యాణ్ కటౌట్లను ధ్వంసం చేశారు. ఖమ్మంజిల్లా పాల్వంచలోని ఒక థియేటర్‌లో ప్రదర్శనను సైతం తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వికారాబాదులోనూ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.
ప్రదర్శనను అడ్డుకోవద్దు: దిల్ రాజు
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉందంటూ తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శన నిలిపివేతపై ఆసినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్‌రాజు స్పందించారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని అభ్యర్థించారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడినని చెప్పారు.
సదుద్ధేశంతోనే తీశాం….
తెలంగాణ వాదులకు సినిమా చూపిస్తానని, ఆ సమయంలో వారికి అభ్యంతరకరమైన దృశ్యాలు చూపితే వాటిని తొలగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని దర్శకుడు పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు. ఎవరినీ కించపరిచే విధంగా సినిమాను రూపొందించలేదని చెప్పారు. సినిమాలో తొలి నుంచి ముగింపు వరకు ప్రతి దృశ్యాన్ని సదుద్ధేశంతోనే రూపొందించానని తెలిపారు.
పూరీ జగన్నాధ్ కార్యాలయంపై దాడి
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా దర్శకుడు పూరీ జగన్నాధ్ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం వెలుపల నిలిపి ఉన్న గుర్తు తెలీని వ్యక్తులకు చెందిన మూడుకార్లను ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిఆర్‌ఎస్‌వి నేత సుమన్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
పూరిజగన్నాధ్‌కు బుద్ది చెబుతాం
ఉద్దేశపూర్వకంగానే సినిమాలో ఆ దృశ్యాలను చిత్రీకరించారని టిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు సుమన్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయని అన్నారు. ఆ చిత్ర దర్శకుడుపూరీ జగన్నాధ్, హీరో పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.