సీమాంధ్ర సర్కారు బరితెగింపుపై భగ్గుమన్న తెలంగాణ జర్నలిస్టులు
గన్‌పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, అరెస్ట్
సర్కారు వైఖరి గ్రహనీయం
గన్‌పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, అరెస్ట్
సర్కారు వైఖరి గర్హనీయం
జర్నలిస్టులను వేధిస్తే ఊరుకోం : కోదండరాం
సర్కారు క్షమాపణ చెప్పాల్సిందే : అల్లంనారాయణ
హైదరాబాద్, అక్టోబర్ 17 (జనంసాక్షి): జీవ వైవిద్య సదస్సు వేదికపై ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాను అనుమతించకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి…తెలంగాణ మీడియాపై సీమాంధ్ర సర్కారు దురహంకార వైఖరి నశించాలని వారు నినాదాలు చేశారు…ఈసందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారంనాడు గన్‌పార్కు నుంచి ర్యాలీగా సచివాలయానికి
ి బయల్దేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిని అడ్డుకోవడం పట్ల ఆగ్రహం చెందిన జర్నలిస్టులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య తోపులాట, వాగ్వాదం చెలరేగింది. దాంతో మహిళా జర్నలిస్టులు డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉండగా ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా మంగళవారంనాడు జరిగిన అవమానానికి నిరసనగా పాత్రికేయులు బుధవారంనాడు గన్‌పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. అన్ని రకాల పాస్‌లు ఉన్నప్పటికీ అనుమతించకపోవడం దారుణమని నినాదాలు చేశారు.
వేధిస్తే ఊరుకోం : కోదండరామ్
తెలంగాణ జర్నలిస్టులను వేధిస్తే ఊరుకోబోమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు నుంచి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడం విచారకరమన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న జర్నలిస్టులను పోలీసులు కావాలనే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నాయకుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెలంగాణ మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పాల్సిందే : అల్లం నారాయణ
ప్రధాని మన్మోహన్సింగ్ పర్యటన నేపథ్యంలో కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుల పట్ల వివక్ష చూపినందుకుగాను బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండు చేశారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వం స్పందించ కుంటే పది రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్ స్థాయిలో కలం కవాతు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా గన్‌పార్కు నుంచి సచివాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకుని జర్నలిస్టులను, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. దీంతో అసెంబ్లీ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించింది.