సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు.  శుక్రవారం  ఆయన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సందర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీమాంధ్ర ప్రభుత్వం సహకారంతోనే విజయమ్మ దండయాత్రలాగా సిరిసిల్లాలో పర్యటన నిర్వహించగలిగిందని, వైఎస్సార్‌సీపీ చేపట్టిన దీక్షకు సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులే వత్తాసు పలికారని ఆరోపించారు.  ఈ విషయంపై తనతో సహా టీ కాంగ్రెస్‌ ఎంపీలందరూ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు వైఎస్‌ఆర్‌ పార్టీపై ద్వంద విధానాన్ని అవలంబిస్తున్నాడనీ, జగన్‌ మహబూబాబాద్‌ పర్యటనకు వచ్చినపుడు అడ్డుకొన్న టీఆర్‌ఎస్‌, వైఎస్‌ జగన్‌ ఆర్మూర్‌లో 3 రోజులు రైతు దీక్ష చేపట్టినపుడు ఒక్కనాడూ ఆ పార్టీని విమర్శించడం కానీ,  జగన్‌ పర్యటనను అడ్డుకోడం కానీ చేయలేదన్నారు. అయితే విజయమ్మ సిరిసిల్లలో పర్యటిస్తున్నపుడు అదే టీఆర్‌ఎస్‌ అడ్డుకోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తాను జమ్మికుంటలో జరిగిన రైల్‌రోకోలో పాల్గొంటే తమ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే తనను అరెస్ట్‌ చేసిందని గుర్తుచేశారు. కాగా వైఎస్సార్‌ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్ముక్కయిందన్న టీఆర్‌ఎస్‌ నాయకుల విమర్శలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఎవరి జండా ఏదైనా తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులందరూ సింగిల్‌ ఎజెండాతో పోరాడాలని అపుడే తెలంగాణ వస్తుందని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, అల్లాడి రమేశ్‌, నరాల పోచెట్టి, సాగరం వెంకటస్వామి, కట్కూరి శ్రీనివాస్‌, చిలుక రమేశ్‌, కూరగాయల కొమురయ్య, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు