సుజానాకు పదవి గండం తప్పదా?

4d5rpq1dకేంద్ర మంత్రి సుజానా చౌదరి రెడ్ జోన్ లో ఉన్నారు. మారిషస్‌ బ్యాంక్ కు రుణం ఎగ్గొట్టిన కేసులో ఆయనకు సంబంధించిన సంస్థ ప్రధాన హామీ దారుగా ఉంది. ఇప్పుడు హామీదారుగా ఉన్న సుజానా సంస్థే ఎగ్గొట్టిన డబ్బులు చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. ఐతే సుజానా సంస్థలు హామీగా ఉన్నది కూడా తనకు సంబంధించిన కంపెనీలకే. సుజానా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హేయిస్టా వందకోట్ల రూపాయలను మారిషస్‌ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. పెద్దగా ఆస్తులు లేని ఆ సంస్థకు సుజానా ఇండస్ట్రీస్ హామీ ఇవ్వటంతో మారిషస్‌ బ్యాంక్ ఏకంగా వందకోట్ల రూపాయల రుణం ఇచ్చింది.

ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ తర్వాతే తమ అసలు నైజం బయటపెట్టుకుంది హేయిస్టా సంస్థ. మారిషస్ కమర్షియల్‌ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఎగ్గొట్టే ప్లాన్ చేసింది. ఐతే ఈ రుణానికి హామీదారుగా ఉన్న సుజానా ఇండస్ట్రీస్ మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తెలిపింది. కానీ హామీదారుగా ఉన్న సుజానా ఇండస్ట్రీస్ డబ్బులు చెల్లించాల్సిందేనని మారిషస్‌ కమర్షియల్ బ్యాంక్ ఆ కంపెనీకి ఢిపాల్టర్ నోటీసులు పంపింది.

అప్పుడే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సుజానా చౌదరికి ఈ వివాదం తలనొప్పిగా మారింది. ఐతే కేసు నుంచి తప్పించుకునేందుకు తాము కేవలం హామీదారులం మాత్రమేనని బొంకే ప్రయత్నం చేశారు. కోర్టులో ఈ వ్యవహారంపై వాదనల అనంతరం హైదరాబాద్‌ హైకోర్టు సుజానా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ అక్కడ కూడా సుజానా చౌదరికి చుక్కెదురైంది. హామీదారుగా ఉన్నందుకు వందకోట్ల రూపాయలను సుజానా ఇండస్ట్రీస్ చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం తీర్పుతో సుజానా చౌదరి డిఫాల్టర్ గా మారారు. బ్యాంక్ కు ఎగ్గొట్టిన డబ్బులు చెల్లిస్తే కానీ ఆయన దోషిగా కాదని చెప్పలేం. ఐతే కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందే ఈ వ్యవహారం బయటపడింది. కానీ ఈ అంశంతో సంబంధం లేదని సుజానా చౌదరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తాజా తీర్పుతో ఆయన ఉద్దేశ పూర్వకంగానే డబ్బులు ఎగొట్టే కంపెనీకీ సహాయం చేశారని స్పష్టమైంది. దీంతో ఆయనకు పదవి గండం తప్పదని తెలుస్తోంది. తన కేబినెట్ లో అవినీతిపరులకు, మోసగాళ్లకు ఛాన్స్ లేదని ప్రధాని మోడీ…సుజానా కు రాం రాం చెబుతారని అంతా భావిస్తున్నారు.