సుప్రిం వ్యాఖ్యలు..  హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి


– అయోధ్య అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
– లేదంటే ఆర్డినెన్స్‌తో భూమిని స్వాధీనం చేసుకోవాలి
– ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ నేత భయ్యాజీ జోషి
న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ నేత భయ్యాజీ జోషీ అన్నారు. థానేలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ మూడు రోజుల ఎగ్జిక్యూటివ్‌ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రామమందిర నిర్మాణ టైటిల్‌ కోసం జరిగిన విచారణలో సుప్రీం చేసిన కామెంట్‌ ఆవేదనకు గురి చేసిందని, ఆవ్యాఖ్యలు హిందువులను అవమానించినట్లుగా ఉన్నాయని జోషీ తెలిపారు. అయోధ్య టైటిల్‌పై తక్షణం విచారణ చేపట్టాలని కోరగా, సుప్రీం మాత్రం వచ్చే జనవరిలో విచారిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. 1992లో చేపట్టిన అయోధ్య ఉద్యమం తరహాలో మళ్లీ పోరాటం చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అవసరమైతే అలా చేస్తామన్నారు. అయోధ్య అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేదంటే ఓ ఆర్డినెన్స్‌తో ఆలయ నిర్మాణం కోసం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. రామ మందిర నిర్మాణం విషయంలో సుప్రీం హిందువుల మనోభావాలను అర్ధం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు జోషీ తెలిపారు. మందిర నిర్మాణంలో ఆలస్యం జరిగితే పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్‌ ఆరోపించారు.