సుప్రీంలో ఆమ్రపాలి గ్రూప్స్‌కు ఎదురుదెబ్బ
– కంపెనీ రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని తీర్పు
– లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఈడీకి ఆదేశం
– 40వేల మంది అమ్రపాలి కస్టమర్లకు ఊరట
హైదరాబాద్, జులై23(జనంసాక్షి) : ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సుప్రింకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని మంంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇండ్ల కోసం వేచి చూస్తున్న సుమారు 40వేల మందికి ఊరట కల్పిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. కంపెనీకి చెందిన రెరా రియల్ ఎస్టేట్ చట్టాన్ని రద్దు చేయాలని కోర్టు చెప్పింది. అసంపూర్ణంగా నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నేషనల్ బిల్డింగ్స్ అండ్ కన్‌స్టక్షన్ర్ కార్పొరేషన్(ఎన్బీసీసీ)కి ఆదేశాలు ఇచ్చింది. కస్టమర్ల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో ఆమ్రపాలి గ్రూపు ఓనర్లను మనీ ల్యాండరింగ్ కేసులో విచారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్‌ను కోర్టు ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లుగా ఉన్న అనిల్ కుమార్ శర్మ, శివ్ ప్రియ, అజయ్ కుమార్‌లు పోలీస్ కస్టడీలోనే ఉండాల్సిందిగా గతంలోనే అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమ్రపాలి గ్రూప్ నుంచి దాదాపు 42,000 ప్లాట్లను కోరుతున్న గృహ కొనుగోలుదారుల్లో కొందరు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రూప్ డైరెక్టర్ల వ్యవహార శైలిని ధర్మాసనం తప్పుబట్టింది. ఆరు నెలల నుంచి మూడేండ్లలో ఆమ్రపాలి గ్రూప్‌లో నిలిచిన 15 రెసిడెన్షియల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, ఇందుకు రూ.8,500 కోట్ల వ్యయం అవుతుందని ఓ ప్రతిపాదననూ గతంలో ఎన్బీసీసీ కోర్టుకు సమర్పించింది. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్లో రూ.847 కోట్ల ఆస్తుల్ని ప్రకటించిన ఆమ్రపాలి గ్రూప్ సీఎండీ.. ఇప్పుడు రూ.67 కోట్ల ఆస్తులనే చెబుతుండటంపైనా సుప్రీం దృష్టి సారించింది. అమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన లావాదేవీల వ్యవహారంపైనా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఈడీనీ సుప్రింకోర్టు ఆదేశించింది.