సుప్రీం చీఫ్ జస్టిస్ కంటతడి!
– మొత్తం భారం న్యాయవ్యవస్థపై మోపద్దు
– దేశాభివృద్ధి కోసం వేడుకుంటున్నాను
– ప్రధాని సమక్షంలో టీఎస్ ఠాకూర్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ,ఏప్రిల్ 24(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రధాని నరేంద్రమోదీ ముందు కంటతడి పెట్టారు. మొత్తం భారాన్ని న్యాయవ్యవస్థపైనే వేయొద్దని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరింతమంది న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరిగింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. ‘దేశ అభివృద్ధికోసం నేను మిమ్మల్ని(కేంద్ర ప్రభుత్వాన్ని) వేడుకుంటున్నాను.న్యాయవ్యవస్థపై మొత్తం భారాన్ని మోపవద్దు.. ప్రపంచ దేశాలతో ఒక్కసారి మా కార్యశీలతను పోల్చి చూసుకోండి’ అని అన్నారు. మోదీగారు.. ఎఫ్‌డీఐ, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు.. దాంతోపాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా
అవసరం అని గుర్తించాలి అని ఆయన చెప్పారు. అమెరికాలో న్యాయమూర్తులు కేవలం 81 కేసులను పరిష్కరిస్తుంటే ఒక భారతీయ జడ్జీ మాత్రం కనీసం 2,600 కేసులు చూస్తున్నారని.. వారిపై ఎంతటి భారం పడుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు.న్యాయవ్యవస్థ విూద పని ఒత్తిడి తగ్గించడానికి, వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో పాలనా వ్యవస్థ క్రియాశూన్యంగా ఉండిపోవడాన్ని ఆయన ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ గొంతు గద్గదమైంది. ప్రసంగం ఆపి కళ్లు తుడుచుకున్నారు. న్యాయస్థానాల ముందు పర్వతాల్లా పేరుకుపోతున్న కేసులను పరిష్కరించాలంటే ప్రస్తుతం 21 వేలు ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 40వేలకు పెంచాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.న్యాయమూర్తి సూచనకు ప్రధాని మోదీ స్పందించారు. న్యాయవ్యవస్థతో కలిసి కేంద్రం తప్పక ఈ సమస్యను పరిష్కరిస్తుందని హావిూ ఇచ్చారు.పలు రకాల వివాదాలతో న్యాయస్థానాల ముందుకు వస్తున్న ప్రజలకోసమో, ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాక జైళ్లలో మగ్గుతున్న వారికోసమో మాత్రమే కాదని… దేశ అభివృద్ధికోసం సందర్భానికి తగినట్లుగా స్పందించాలని, బరువంతా న్యాయవ్యవస్థపై వేయడం తగదని జస్టిస్ ఠాకూర్ గద్గద స్వరంతో అన్నారు.రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం ఈరోజు దిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 1987లో లా కమిషన్ సిఫార్సులను గుర్తుచేశారు. పది లక్షల జనాభాకి పది మందిగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 50కి పెంచాలని సిఫార్సు చేయగా ఇంతవరకూ దానిపై ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. ఆ తర్వాత కూడా ఈ విషయంపై పలు సిఫార్సులు ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి ఆయన గుర్తుచేశారు.1987లోనే 40 వేల మంది న్యాయమూర్తుల అవసరం ఉండేదని, ఆ తర్వాత జనాభా పాతిక కోట్లు పెరిగిందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని సుప్రీం చీఫ్ జస్టిస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇతర దేశాలవారిని మనదేశంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్న మనం.. వారు మన న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని, పనితీరును పరిశీలిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. లావాదేవీలు పెరిగే కొద్దీ సత్వరం స్పందించాల్సిన న్యాయవ్యవస్థ అవసరం ఉంటుందని జస్టిస్ ఠాకూర్ గుర్తుచేశారు.కాగా .ఈ కార్యమ్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు.అనవసర చట్టాలను తొలగించి, న్యాయ వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందా గౌడ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు గైర్హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.




