సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా


న్యూఢిల్లీ.జ‌నంసాక్షి): కొలీజియం సిఫారసు మేరకు ప్రభుత్వం ఆమోదంచిన దరిమిలా ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 61 ఏళ్ల ఇందూకు న్యాయశాస్త్రంలో విశేష అనుభవం ఉన్నది. కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం వెలువరించిన ఉత్తర్వుల మేరకు చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందూ మల్హోత్రా 2007 నుంచి సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు జడ్జి పదవికి ఇందూమల్హోత్రా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కేఎం జోసఫ్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందూమల్హోత్రా పేరును మాత్రమే ఖరారు చేసింది. జస్టిస్‌ కేఎం జోసఫ్‌ పేరును తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు జడ్జీగా
నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందూ మల్హోత్రా బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి ఓంప్రకాశ్‌ మల్హోత్రా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఇందూ 1983లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 35ఏండ్లుగా ఢిల్లీలోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె 2007 నుంచి సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మధ్యవర్తిత్వ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టాల నిపుణురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆమె పలు చట్టాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసినవారిని పోలీసులు, ఇతరులు వేధించకుండా రక్షించే చట్టానికి లైఫ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ఇందూ మల్హోత్రాతో కూడిన కౌన్సిల్‌ రూపకల్పన చేసింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం తయారీకి ఏర్పాటైన విశాఖ కమిటీలో, మహిళా న్యాయవాదులుపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో, ఆర్బిట్రేషన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను రూపొందించేందుకు బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో నియమించిన కమిటీలో ఆమె సభ్యురాలు. వరకట్న వేధింపుల్లో అరెస్టులకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని దాఖలు చేసిన కేసులో ఇందూను సుప్రీంకోర్టు అమికస్‌క్యూరీగా నియమించింది. మహిళా మేకప్‌ ఆర్టిస్టులపై వివక్షకు వ్యతిరేకంగా ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు.