సుప్రీం పర్యవేక్షణలో వ్యాపంపై సీబీఐ విచారణ

3

న్యూఢిల్లీ/భోపాల్‌,జులై 9 (జనంసాక్షి):

మద్యప్రదేశ్‌ లో జరిగిన వ్యాపంఉద్యోగాల కుంభకోణం పై సిబిఐ విచారణకు సుప్రింకోర్టు ఆదేశించింది. తమ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుందని సుప్రింకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. .ఈ కేసుకు సంబందించి జవాబు ఇవ్వాలని మద్యప్రదేశ్‌ గవర్నర్‌,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేశారు.  ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చారు.ఈ కేసులో ఉన్నవారుకాని ,సాక్షులు కాని నలభై ఎనిమిది మంది మరణించడం సంచలనంగా ఉంది. ఈ కేసులో న్యాయవ్యవస్థ పాత్ర కూడా ఉందంటూ సుప్రింకోర్టుకు కొందరు ఫిర్యాదు చేశారు.అలాగే కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తదితరులు కూడా ఈ కేసుపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రిం కోర్టులో వేశారు.దీంతో ఈ వ్యాపం వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. లక్షలాది మంది ప్రయోజనాలను పణంగా పెట్టి ఇందులో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దీనిపై నిజాలు నిగ్గు తేలాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే వ్యాపం కుభకోణంలో అనుమానాస్పందగా మృతిచెందిన జర్నలిస్ట్‌ అక్షయ్‌సింగ్‌ కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేడు పరామర్శించారు. జర్నలిస్ట్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవడంతో పాటు ఆర్థికసాయం, ఉద్యోగం కల్పిస్తాం. అక్షయ్‌సింగ్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా చౌహాన్‌ ఆఫర్‌ను అక్షయ్‌ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఇదిలావుంటే వ్యాపం స్కాం కేసు విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ… సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును… ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిపించాలని కోరింది. ఐతే ఈ కేసులో గవర్నర్‌ రామ్‌నరేష్‌ యాదవ్‌ను… బీజేపీ ఎందుకు కాపాడలని చూస్తుందో  వెల్లడించాలని… ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఆశిష్‌ కేతన్‌ డిమాండ్‌ చేశారు. ఇక వ్యాపం స్కాంపై సీబీఐ విచారణకు.. మధ్యప్రదేశ్‌ సర్కారు సిఫార్సు చేయటంతో ఆ కుంభకోణంతో సంబంధమున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు..ఇలా ఎంతో మందితో జాబితా ఉంది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ప్రముఖ మెడికల్‌ కాలేజ్‌ జీఎస్‌ వీ ఎమ్‌ లో సుమారు 54 మంది వ్యాపం స్కాంలో భాగంగానే అడ్మిషన్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను గతంలో విచారణ కోసం మధ్యప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ అదుపులోకి తీసుకుంది. విద్యార్థులో అందులో భాగంగా అరెస్టయ్యారు. వీరిలో 22 మంది బెయిల్‌ విూద బయటకు వచ్చి మళ్లీ కాలేజ్‌లో జాయిన్‌ అయ్యారు. ఆరుగురు ఇప్పటికీ జైల్లో వున్నారు. 8 మంది ఆచూకీ మాత్రం లేదు. వీరంతా 2013 ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్‌ పొందారు. కొన్ని నెలలుగా వీరు కాలేజ్‌కు రావటం లేదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం వాళ్ల విషయాలు ఏవిూ తెలీవని స్పష్టం చేస్తోంది.