సుష్మా రాజీనామా చెయ్..
– దిల్లీలో ఊపందుకున్న కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ,జూన్15(జనంసాక్షి): విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్ మోదీకి ఇంగ్లండ్‌లో అత్యవసర వీసా ఇప్పించినందుకు సుష్మాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లలిత్‌మోదీ లండన్ నుంచి ఫోర్చుగల్ వెళ్లేందుకు అనుమతులు లభించేలా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లలిత్ మోదీకి సహకరించిన సుష్మా తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లలిత్ మోదీకి వీసా ఇప్పించేందుకు సుష్మా సహకరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె రాజీనామాకు పట్టుబడుతున్నారు. ఈ వివాదంపై ఇంతవరకు పెదవి విప్పని ఆమె తన నిర్ణయాన్ని ప్రధాని మోదీ ముందు సమర్థించుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం విదేశాల్లో అక్రమాక్కులకు వీసాలు ఇప్పిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సుష్మా స్వరాజ్‌కు మోదీ ప్రభుత్వం సహకరిస్తోందని, విదేశాల్లో వీసాలు ఇచ్చేందుకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… సుష్మాను సమర్థించడం ఘోరమని తివారీ అన్నారు. వెంటనే సుష్మా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లలిత్‌మోదీ వీసా వివాదం తర్వాత సుష్మాస్వరాజ్ ఎక్కువగా తన నివాసానికే పరిమితమయ్యారు. ఇదే అంశంపై ఆదివారం ఆమె ప్రధాని మోదీని కలిసారు. ప్రధాని ముందు తన నిర్ణయాన్ని ఆమె సమర్ధించుకున్నారు. కేవలం మానవతా ధృక్పథంతోనే లలిత్‌మోదీకి వీసా ఇప్పించేందుకు సహకరించినట్లు సుష్మా మోదీకి వివరణ ఇచ్చారు. వీసా వివాదం నేపథ్యంలో సుష్మా ఇంటిముందు
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ మాత్రం సుష్మాను వెనుకేసుకువస్తున్నారు. ఆమె జీవితం పారదర్శకమైందని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆమె మానవతా ధృక్పథంతోనే లలిత్‌మోదీకి వీసా ఇప్పించారని ఆయన అన్నారు. ఇందులో అపరాథం ఏముందని చౌహాన్ ప్రశ్నించారు. సుష్మా విూద తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. లలిత్ మోదీ 2010లో లండన్ వెళ్లారు. అప్పుడే ఆయనపై ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇంగ్లండ్ పోలీసులు లలిత్‌మోదీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. లండన్ దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. లండన్ కోర్టులో ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అంతలో 2014 వేసవిలో లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లారు. ఆయనకు వీసా ఇవ్వడానికి ఇంగ్లండ్‌లోని భారత సంతతి ఎంపీ కీత్ వాజ్ సాయపడ్డారు. కీత్ వాజ్ చర్య ఇప్పుడు ఇంగ్లండ్‌లో వివాదం అయ్యింది. సుష్మా స్వరాజ్ ప్రొద్బలం వలనే లలిత్‌మోదీకి సాయం చేసినట్లు కీత్ వాజ్ వెల్లడించారు. ఇదిలావుంటే దిల్లీలోని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు ఆందోళన చేపట్టారు. లలిత్‌మోదీ వీసా వివాదంలో సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలన్న ఏచూరి
బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్ మోదీకి వీసా ఇప్పించిన సుష్మా స్వరాజ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుష్మాను తన కేబినెట్‌లో ఉంచాలనుకుంటున్న మోదీ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏచూరి విూడియాతో మాట్లాడుతూ వీసా వ్యవహారంపై ప్రధాని ఎలా స్పందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ ప్రస్తావిస్తామని ఆయన అన్నారు. ప్రధాని తన కేబినెట్‌లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నా ఆయన ఇష్టమని ఏచూరి అన్నారు. కానీ లలిత్ మోదీకి వీసా ఇచ్చిన అంశంపై మాత్రం ప్రధాని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ అధిపతి లలిత్ మోదీకి బ్రిటన్ ప్రయాణ పత్రాలు జారీ అయ్యేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేసినందుకు ప్రతిపక్షాల విమర్శల పరంపర కొనసాగుతోంది. తాజాగా సీపీఎం పార్టీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై ఆ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. లలిత్ మోదీ విషయంలో సుష్మ కలగజేసుకోవడం ఆమోదయోగ్యం కాదని అందులో పేర్కొన్నారు. తమ పాలనలో ఏడాది కాలంలో ఎలాంటి అవినీతికి తావు ఇవ్వలేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై క్షుణ్ణంగా విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేశారు.