సుష్మా, వసుంధర, సృతి ఇరానీలు రాజీనామా చేయాలి
– దిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్
న్యూఢిల్లీ,జూన్ 28(జనంసాక్షి):అవినీతి మరక అంటిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను బిజెపి నుంచి బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరిశుద్ధ రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్ ప్రభుత్వంలో నకిలీ విద్యార్హతల వ్యవహారంలో అరెస్టు అయిన న్యాయశాఖ మంత్రి జితేం దర్ సింగ్ తోమర్ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని కేజ్రీవాల్ తిప్పికొడుతూ తోమర్‌పై కేసు నమోదై, అరెస్టయిన వెంటనే కేబినెట్ నుంచి తొలగించామని, అలాగే పార్టీకి అతను రాజీనామా చేశాడని, అది కూడా ఆమోదించామన్నారు. రాజకీయాలు పూర్తిస్థాయిలో కలుషితమయ్యాయని, అందరూ నీతిమయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ, వీటి పవిత్రతను కాపాడలేకపోతున్నారని ఆయన వాపోయారు. బిజెపి నీతి మయ రాజకీయాల గురించి మాట్లాడుతోందని, ముందు
అవినీతికి పాల్పడిన ముగ్గురిని పదవుల్లోంచి, పార్టీ లోంచి తొలగించిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడాలని ఆయన బిజెపికి సవాల్ విసిరారు. ముగ్గురు మహిళా నేతలు పార్టీ నుంచి తొలగించాలని కోరుతూ అప్ ఆందోళన చేస్తుందన్నారు. వారిని తొలగించేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.