సూటిగా మాట్లాడమనడానికి నువ్వెవరు

4
– కేటీఆర్‌పై అక్బరుద్దీన్‌ అసహనం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి):

రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యలపై అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ సభలో పెద్దగొంతు వేసుకుని మాట్లాడటం సరికాదని… ఏదైనా ఉంటే సూటిగా చెప్పాలని అక్బరుద్దీన్‌కు సూచించారు. రుణమాఫీని ఒకేసారి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్‌ సభాపతి ఉండగా సూటిగా మాట్లాడమని చెప్పడానికి మంత్రి ఎవరని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై బాధతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. కేటీఆర్‌ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడితే మంచిదని సూచించారు. తెలంగాణ రాష్ట్రం గుజరాత్‌ తర్వాత దేశంలో రెండో ధనిక రాష్ట్రమని ఆర్థిక మంత్రి చెప్పారని… మరి రైతు ఆత్మహత్యల్లోనూ దేశంలో రెండో స్థానంలో ఉన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. రైతుల సమస్యలపై తెలంగాణ శాసనసభలో నిర్వహించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యల నివారణకు పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అక్బరుద్దీన్‌ విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రతి సమావేశాల్లోనూ చర్చలు జరుగుతూనే ఉందని… సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో సాధారణ వర్షపాతం, సాగు పరిస్థితి సంతృప్తిగా ఉన్నప్పటికీ 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వరంగల్‌ జిల్లాలో 108 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎనిమిది జిల్లాల్లో 100కు పైగా ఏడీఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని… వ్యవసాయశాఖలో ఇన్ని ఖాళీలుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ వూరుకుంటోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం మాదిరిగానే ప్రతి నియోజకవర్గం ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.