సెక్షన్‌ 8కు నేను వ్యతిరేకం

5

– అంక్షలు విధిస్తే తెలంగాణ ఇచ్చిన ఆనందం ఏముంది?

– హైదరాబాద్‌ గురించి ఆలోచించడం మానేయాలి

– ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుపై దృష్టి సారించాలి

– జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌,జులై6(జనంసాక్షి): సెక్షన్‌ 8కి తాను వ్యతిరేకమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. సెక్షన్‌ 8మ అమలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆనందాన్ని తీసేయొద్దని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారితీస్తే సెక్షన్‌ 8 అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సెక్షన్‌ 8 అమలు బాధ్యత కేంద్రానికి అప్పగించి తప్పు చేయొద్దని.. దాని బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూసుకోవాలని సూచించారు. పార్టీ పెట్టినప్పటినుంచి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతున్నానని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చంద్రబాబుపై అబియోగం వస్తే సెక్షన్‌ ఎనిమిది రాదని అన్నారు.తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని హైదరాబాద్‌ పై ఆలోచించడం మాని ఏపీ ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు పై దృష్ఠి సారించాలన్నారు.

కేంద్రం ఎపికి అన్యాయం చేసిందని ,కాని అంత మాత్రాన ,సెక్షన్‌ ఎనిమిది పరిస్థితి వచ్చేలా చేయవద్దని అన్నారు. దీనికి కెసిఆర్‌ బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రాలు విడిపోయాక అందరం బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను ఎక్కువగా మాట్లాడలేదని… నోరుపారేసుకోవడం వల్ల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న పవన్‌ ఆచితూచి మాట్లాడుతూనే  పోన్‌ టాపింగ్‌ పై మాత్రం కొంచెం ఘాటుగా మాట్లాడారు.అదే సమయంలో సీమాంద్ర ఎమ్‌.పిలను పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యంగా బిజెపి,టిడిపి ఎం.పిలను ఆయన తీవ్రంగా విమర్శించడం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ను కూడా ఒక సందర్భంలో ప్రశంసించినా, ఆ తర్వాత పోన్‌ టాపింగ్‌ , వివాదాలపై మాత్రం టిఆర్‌ఎస్‌ ను విమర్శించారు. అయితే తెలుగుదేశం పార్టీని కాని, ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు గురించి కాని ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. అయితే విూడియా విషయంలో స్వేచ్చ ను హరించవద్దని ఇద్దరు సి.ఎమ్‌ లను కోరడం జరిగింది. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ వీడియా, చంద్రబాబు ఆడియో గురించి గాని పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలిశానని .. ఆ సందర్భంగా తెలుగుజాతి ఐక్యత దేశ సమగ్రతలో భాగమని చెప్పారన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆనందసాయి అనే వ్యక్తిని యాదాద్రి ఆర్కిటెక్ట్‌గా నియమించి తెలుగుజాతి ఐక్యతకు కేసీఆర్‌ ముందడుగు వేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని వేసి పర్యవేక్షించాలన్నారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చాలా తీవ్రమైనది, సున్నితమైన విషయమని  పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం రెండు ప్రభుత్వాల మధ్య అసహనానికి దారి తీస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి కేసు రెండు రాష్ట్రాల  రాజకీయ క్రీడగా అభివర్ణించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుంటే ప్రజల్లో అంతర్యుద్దానికి దారితీస్తుందని చెప్పారు. అందులో భాగమే ప్రాజెక్టులు దగ్గర మొన్న 2 రాష్ట్రాల పోలీసులు రక్తమోడేలా కొట్టుకున్నారన్నారు. కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ మారారని.. తలసానిని తెరాసలోకి తీసుకురాగలరుగానీ సనత్‌నగర్‌ ప్రజల మనసుల్లో చూడగలరా అని ప్రశ్నించారు. ఆయన మళ్లీ ఇక్కడి ప్రజల ఆదరణ చూరగొనగలరా అని ప్రశ్నించారు. తనకు అభిప్రాయాలు ఉన్నాయని,కాని కావాలని మాట్లాడలేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విభజన తర్వాత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని భావించానని అన్నారు. నోరు పారేసుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్నానని అన్నారు. తనను మాట్లాడడం లేదని అంటారని ,కాని కావాలని మౌనంగా ఉన్నానని అన్నారు.ప్రస్తుత రాజకీయాలు నీతి,నిజాయితికి అవకాశం లేని పరిస్థితి కనబడుతోందని అన్నారు. ఆంద్రులు అంటే అన్ని వర్గాలవారు ఉంటారని జనసేన వ్యవస్థపాకుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఆంధ్రులు అంటే కమ్మ సామాజికవర్గమే కాదని, మాల,మాదిగలు ఉంటారని, బొత్సగారికి చెందిన కాపులు ఉన్నారని అనగానే విూడియా ప్రతినిధులు గొల్లున నవ్వారు. పవన్‌ కూడా నవ్వేశారు. ఆంద్రావాళ్లంతా టిడిపిలో ఉండరని, చంద్రబాబు సామాజికవర్గం ఒక్కటే కాదని, అనేక కులాలు, సమ్మేళనాలు ఉన్నాయని అన్నారు. కావాలంటే చంద్రబాబును విమర్శించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించవచ్చు.కాని ఆంధ్రులు అని అందరిని అనడం సరికాదని ఆయన అన్నారు.  చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు. ఆంధ్ర అంటే ఒక జాతి అని వివరిస్తూ వారిలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు… ఇలా అందరూ ఉన్నారని, ఆంధ్రోళ్లు అంతా తెలుగుదేశం పార్టీలో లేరని ఆయన గుర్తు చేశారు. తనను ఎవరైనా విమర్శించవచ్చునన ఆయన అన్నారు.హైదరాబాద్‌ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. కెసిఆర్‌ కూడా రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజల మధ్య ఐక్యత తేవడానికి కృషి చేయాలని అన్నారు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని  పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.  రాష్ట్ర విభజనకు యుపిఏ, ఎన్డీయే రెండూ బాధ్యులే అంటూ తెలంగాణకు మంచి జరిగింది, మంచిదే, కాని ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు.  విభజన సమస్యలు పరిష్కరించకపోతే శ్రీలంక తరహా సమస్యలు తలెత్తుతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.విభజన సమయంలో తెలంగాణ ఎంపీలు పనిచేసినట్టు ఆంధ్ర ఎంపీలు పనిచేయలేదని ఆయన ఆక్షేపించారు. అందుకు కారణం వారు వ్యాపారవేత్తలు కావడమేనని ఆయన వివరించారు. విూ రాష్ట్రంకోసం విూరు పనిచేయవలసింది పోయి విూ వ్యాపారాలకోసమే పనిచేసుకుంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం చేసేది విూరే అవుతారని కూడా ఆయన హెచ్చరించారు. విూకు పనిచేయడం చేతకాకపోతే రాజకీయాలలో ఉండకండి అని కూడా ఆయన హితవు చెప్పారు.