సెట్విన్‌ బస్సు ఢీకొని ఆటో ధ్వంసం

ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌లో సెట్విన్‌ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఒక ఆటో ధ్వంసమైంది. అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆటో ధ్వంసమైంది. డ్రైవర్‌ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు ప్రయాణీకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే అర్థరాత్రి నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో కొండాపూర్‌కు చెందిన జయంత్‌, పవన్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జయంత్‌ అనే వ్యక్తి మద్యం తాగి కారు నడిపినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.