సెప్టెంబర్‌ 7 వరకు టెన్షనే

రోవర్‌ క్షేమంగా దిగే వరకు ఇస్రో అధ్యయనం
అక్కడి పరిశోధనల సవాల్‌ స్వీకరించిన ఇస్రో
శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): భారత్‌ అంతరిక్ష పరిశోధనల్లో మరోమైలు రాయిని చేరుకున్నాం. సెప్టెంబర్‌ 7న ఇప్పుడు పంపిన రోవర్‌ జాబిల్లిని ముద్దాడనుంది. క్షేమంగా దిగిన తరవాత 14 రోజుల పాటు అది పరిశోధనలు చేస్తుంది. నీటి జాడలతో పాటు, ఖనిజాల జాగను కనిపెడుతుంది. దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రోవర్‌ ఇస్రోకు చేరవేస్తుంది.  మూడేళ్ళక్రితం రోవర్‌ను దింపిన చైనా కూడా మనలా  ధైర్యం చేయలేదు. అత్యంత సంక్లిష్టమైన ‘సాప్ట్‌ల్యాండింగ్‌’ లో ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే నెగ్గాయి. 2008లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా సహకారంతో జరిపిన తొలి చంద్రయానంలో నీటిజాడను గుర్తించిన ప్రాంతంలోనే ఈ మలిచంద్రయానం సాగుతూ, 14రోజులపాటు పనిచేసే ల్యాండర్‌, రోవర్‌ ఎన్ని రహస్యాలు ఛేదిస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. చందమామ పుట్టుపూర్వోత్తరాలు, నీటి ఉనికి, ఖనిజాన్వేషణలతో పాటు ఈ కొత్త ప్రాంతంలో హీలియం3ను గుర్తించడం అసలు లక్ష్యం. చంద్రుని హీలియంవిూద అనేక దేశాలు కన్నేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం వ్యూహాత్మకంగా కూడా కీలకమైనది. సెప్టెంబర్‌ 7న మన రోవర్‌ చంద్రుడిపై దిగుతుంది. అప్పటి వరకు
ఇస్రో శాస్రవేత్తలకు నిత్య టెన్షన్‌ తప్పదు. అది క్షేమంగా దిగి తన కార్యక్రమాలను పూర్తి చేసే వరకు ఏం జరుగుతుందో అన్నది నిరంతరంగా పర్యవేక్షిస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన చంద్రయాన్‌-2 ప్రయోగం ప్రారంభం నుంచి చివరి వరకు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు రాకెట్‌ పయనం ఆరంభమైంది.  సోమవారం మధ్యాహ్నం నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన జిఎస్‌ఎల్వీ మార్క్‌3 రాకెట్‌ 16 నిముషాల్లో చంద్రయాన్‌-2ను నిర్ణీత భూ కక్ష్యలో వదిలిపెట్టడంతో ఒక కీలకఘట్టం పూర్తయింది. నెలన్నర తరువాత, ఆర్బిటర్‌నుంచి ల్యాండర్‌ వేరుపడి, చందమామ విూదకు అత్యంత సున్నితంగా దిగే ‘సాప్ట్‌ల్యాండింగ్‌’ పక్రియను ఇస్రో చైర్మన్‌ ‘ఫిప్టీన్‌ మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’గా అభివర్ణించారు. నిర్దేశిత కక్ష్యలో కాలూనినట్టుగా చంద్రయాన్‌-2 నుంచి సంకేతాలు రాగానే, అంతరిక్ష చరిత్రలో భారత్‌ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ అన్నారు. తొలి చంద్రయానంలోనూ, మంగళయానంలోనూ ఇస్రో ఆర్బిటర్‌లను మాత్రమే ప్రయోగించింది. ఇప్పుడు చంద్రుడిపై చక్కర్లు కొట్టే ఆర్బిటర్‌తో పాటు, దాని నేలను తవ్వి పరీక్షలు జరిపే రోవర్‌ను కూడా దింపుతున్నది. ఇంతవరకూ ఎవరూ స్పృశించని, అన్వేషించని దక్షిణధృవంలో రోవర్‌ను దింపడం, అది కచ్చితంగా కాలూనే ఆ చిన్ని ప్రాంతాన్ని చివరినిముషాల్లో నిర్థారించబోవడం సాహస ప్రక్రియగానే గచూడాలి. అభివృద్ధి దశలో ఉంటూనే గతంలో అది రెండు విజయాలు సాధించినప్పటికీ, ఇప్పుడు కనుక విఫలం చెందివుంటే ఆ ప్రభావం 2022లో సంకల్పించిన గగనయానంవిూద కచ్చితంగా పడేది. క్రయోజనిక్‌ సాంకేతికతను మనం రెండు దశాబ్దాల్లోనే అందిపుచ్చుకోగలిగినా, దానిలో రాటుదేలవలసిన అవసరం ఇంకా మిగిలే ఉంది. దీనికి భిన్నంగా, అంతరిక్ష ప్రయోగాలను దేశ ఆత్మగౌరవంతోనూ, రాజకీయాలతోనూ ముడిపెడుతూ పోతే శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెరుగుతుంది. వైఫల్యాలు ఎదురైన పక్షంలో వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అయితే ఇస్రో ప్రస్థానం అద్భుతమైనది. మొన్నటి మంగళయానాన్నీ ఇప్పటి చంద్రయానాన్నీ కొన్ని ఇంగ్లీషు సినిమాల కంటే తక్కువ ఖర్చుతో నెరవేర్చింది. మిషన్‌ ఇప్పుడే పూర్తి కాలేదని, రోవర్‌ చంద్రుడిపై అడుగిడేంతవరకు రాబోయే ఒకటిన్నర నెలల్లో 15 కీలక దశలను చేపట్టాల్సి ఉన్నదని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌  వివరించారు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో రోవర్‌ను మృదువుగా దించే 15 నిమిషాలు అత్యంత క్లిష్టమైనవని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి చంద్రయాన్‌-2 బృందం రాత్రింబవళ్లు అకుంఠిత దీక్షతో పనిచేసిందని, వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలో ఎదురైన సాంకేతిక అవరోధాన్ని అధిగమించి.. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాన్ని విజయవంతం చేశామని చెప్పారు. నిరాశ తరువాత విజయాన్ని అందుకున్నామని పేర్కొన్నారు.