సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆధునిక వ్యవసాయ పద్దతులు

కసరత్తు చేస్తోన్న వ్యవసాయ శాఖ

నిజామాబాద్‌,జూన్‌27(జ‌నం సాక్షి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించే ఏర్పాట్లు చేయడంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించేందుకు వ్యవసాయ శాఖ పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పంటల సాగుకు సంబంధించి ఏ నేలల్లో ఏపంటలు వేయాలి? పంటలకు తెగుళ్లు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలనే విషయంపై రైతులకు అవగాహన తక్కువ ఉంటోంది. దీనిని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా రసాయ ఎరువులను అమ్మి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.ఇలాంటి విషయాల్లో తగిన సూచనలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణదారుడి సూచనలమేరకు ఏ క్రిమి సంహారక మందు ఇస్తే అది తీసుకొచ్చి పంటలపై పిచికారి చేస్తున్నారు. దీంతో అధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందేలా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇక్రిశాట్‌ సహకారంతో పంటల సాగుకు సంబంధించి విషయాల్ని రైతాంగానికి చేరే విధంగా ప్రత్యేక చర్యల్ని వ్యవసాయశాఖ చేపడుతోంది. అధునాతన ఫోన్లను వినియోగిస్తున్న రైతులకు వాటి ద్వారానే వ్యవసాయ సూచనలుచేసి వారికి అండగా నిలవాలని చూస్తోంది. చీడపీడల నివారణ మొదలు అనేక సమస్యలకు సంబంధించి తిరిగి రైతుకు సమాచారం అందుతుంది. ఇందుకోసం ఇక్రిశాట్‌ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల రాజధానిలో వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవస్థను రైతుల చెంతకుతీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానంగా వరి, మొక్క జొన్న, సోయా, పొద్దుతిరుగుడు, చెరకు, పప్పుదినుసుల వంటి పంటల్ని రైతులు సాగు చేస్తున్నారు. తెగుళ్లు, చీడపీడల వ్యాప్తి ఎక్కువగానే ఉంటుంది. చదువుకున్న రైతులకు మాత్రం ఈ అధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొంత వరకు మేలు జరిగే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు.