సోదాలు.. అరెస్టులు మద్యం వ్యాపారుల్లో దడ పెంచిన ఎసిబి
హైదరాబాద్, జూన్ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, మెదక్, నల్గొండ, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో మద్యం వ్యాపారుల ఇళ్లపై, వారి కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఎసిబి డీజీ ప్రసాదరావు ధృవీకరించారు. కాకినాడలో పలువురు మద్యం వ్యాపారుల ఇళ్లపై దాడులు చేశారు. మామిడాల వెంకటేష్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మెదక్ జిల్లా గజ్వేల్‌లో మద్యం వ్యాపారి కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. ఆయన్ను అరెస్టు చేశారు. కడప జిల్లా చిట్వేల్‌లో మద్యం వ్యాపారి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఐదుగుర్ని అరెస్టు చేసినట్టు తెలిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పుప్పాల నాగేశ్వరరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుంది. గుంటూరు జిల్లా గుంటూరులోను, తెనాలిలోను సోదాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఎసిబి దాడుల విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది.