సోనియా తదితరులకు ఎస్పీజీ ఉపసంహరణతో సందిగ్ధం

బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల కోసం సిఆర్పిఎఫ్‌ లేఖ

న్యూఢిల్లీ,నవంబర్‌19(జనం సాక్షి): సోనియాగాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) కు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సంచలన లేఖ రాసింది. ఓ వైపు పార్లమెంటులో భద్రతపై ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌, అతని భార్య గురుశరణ్‌ కౌర్‌ల భద్రత కోసం బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు అందించాలని సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌కు లేఖ రాసింది. ఈ నెల 8వతేదీన సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి, జడ్‌ ప్లస్‌ కేటగిరి రక్షణ బాధ్యతలను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌నకు కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ అప్పగించిన నేపథ్యంలో ఈ లేఖ రాసింది. సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉన్నపుడు కేటాయించిన టాటాసఫారీ, స్కార్పియో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లను వినియోగించేవారు. ఎస్పీజీ భద్రతను తొలగించటంతో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను కూడా ఎస్పీజీ ఉపసంహరించుకుంది. సోనియాగాంధీ కుటుంబానికి ఒక్కొక్కరికి వందమంది సాయుధ కమెండోలతో జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించిన నేపథ్యంలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను కూడా సత్వరం అందించాలని సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ను కోరింది. కొత్తగా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు కొనాలంటే అధిక సమయం పడుతుందని, ¬ంమంత్రిత్వశాఖ వద్ద అందుబాటులో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను వెంటనే అందించాలని సీఆర్‌పీఎఫ్‌ లేఖలో కోరింది. జమ్మూకశ్మీర్‌ తోపాటు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటించేటపుడు మందుపాతరల బారి నుంచి సోనియాగాంధీ కుటుంబాన్ని కాపాడేందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను అందించాలని సీఆర్‌పీఎఫ్‌ కోరింది.