సోనియా, రాహుల్‌కు ఊరట
ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ రథసారథులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అదేసమయంలో వారిపై వచ్చిన ఆరోపణలు వారు వాదనలు వినిపించి నిరూపించుకోవాలని అపెక్స్ కోర్టు సూచన చేసింది. అంతేకాకుండా, ఈ కేసులో హైకోర్టు చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది. హైకోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందని సుప్రీం అభిప్రాయపడింది. కోర్టుకు హాజరవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు. వారి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా శుక్రవారం న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ విూడియాతో మాట్లాడుతూ మోసం, విశ్వాస ఘాతుకం లాంటవేవిూ అందులో లేవని అన్నారు. అదో చారిటబుల్ ట్రస్ట్ అని, ఈ దశలో ఒక ముగింపునకు రావడం సరికాదని న్యాయస్థానం చెప్పిందని ఆయన చెప్పారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలతో కొందరు కోర్టుకు వెళ్లారన్నారు.