సోలార్‌ పవర్‌లోకి ఎన్టీపీసి

ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ
గోదావరిఖని,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఇంతకాలం థర్మల్‌ పవర్‌పై దృష్టి సారించిన ఎన్టీపీసి సోలార్‌ పవర్‌పైనా దృష్టి పెట్టింది.  నాలుగేళ్ల క్రితం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. దీని విస్తరణలో భాగంగా మరో 15 మెగావాట్ల సోలార్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఎన్టీపీసీ ప్రయత్నిస్తున్నది. ఈ యూనిట్‌కు సంబంధించి గత జూలైలోనే టెండర్ల ప్రిక్రియ పూర్తి చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్టీపీసీకి చెందిన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 320 మెగావాట్ల ప్లోటింగ్‌ సౌర విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎన్టీపీసీ ప్రణాళికలు రూపొందించింది. దీంతో  రామగుండం పారిశ్రామిక ప్రాంతం సోలార్‌ పవర్‌ హబ్‌గా అవతరించనున్నది. థర్మల్‌ విద్యుత్‌ రంగంలో 2600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ, 62.5 మెగావాట్ల టీఎస్‌ జెన్‌కో విద్యుత్‌ కేంద్రం, 25 మెగావాట్ల కేశోరాం క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంటు నడుస్తున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(స్టేజ్‌ 1) నిర్మాణం జరుగుతున్నది. సాంప్రదాయేతర(రిన్యూవబుల్‌ ఎనర్జీ) విద్యుత్‌ ఉత్పత్తి రంగంపై ఎన్టీపీసీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా మొదటి దశలో 100 మెగావాట్ల సోలార్‌ యూనిట్‌కు సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. శనివారంతో టెండర్‌ గడువు ముగుస్తుంది. ప్రస్తుత మార్కెట్‌రేటు ప్రకారం సుమా రు 350 కోట్లతో 320 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పనున్నారు.దేశంలోనే అతి పెద్ద విద్యుత్‌ సంస్థగా పేరున్న ఎన్టీపీసీ 80 శాతానికిపైగా థర్మల్‌ విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. రిన్యూవబుల్‌ విద్యుత్‌ రంగంలో రానున్న 5 ఏళ్లలో 10 వేల మెగావాట్ల సామర్థ్యానికి విస్తరించేందుకు ఎన్టీపీసీ ప్రయత్నిస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ క్లీన్‌అండ్‌గ్రీన్‌ ఎనర్జీపై ఎన్టీపీసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.