సోషల్‌ విూడియా హబ్‌ను 

ఏర్పాటు చేయడంలేదు
– సుప్రింకోర్టుకు తెలిపిన కేంద్రం తరపు న్యాయవాది
– వాట్సాప్‌ సందేశాల నిఘాపై కేంద్రం యూటర్న్‌
న్యూఢిల్లీ, ఆగస్టు3(జ‌నం సాక్షి) : సామాజిక మాధ్యమాల్లోని సమాచార సరళిని పరిశీలించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎటువంటి సోషల్‌విూడియా హబ్‌ను ఏర్పాటు చెయ్యడం లేదని కేంద్రం తరఫు న్యాయవాది అటార్నీ జనరల్‌ కేకే.వేణుగోపాల్‌ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమ ప్రసారం కేంద్రం(ఎస్‌ఎంసీహెచ్‌)ను ఏర్పాటు చేయాలని కేంద్రం సమాచార, ప్రసార శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై గత నెల విచారణలో సుప్రీంకోర్టు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజల వాట్సాప్‌ సందేశాలను ట్యాప్‌ చేయాలనుకుంటున్నారా’? అని ప్రశ్నించింది. ఇలాంటి చర్య దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ప్రతి ట్వీట్‌ను, వాట్సాప్‌ సందేశాన్నీ ప్రభుత్వం పరిశీలించాలని భావిస్తుంటే.. మనం నిఘా రాజ్యం వైపు పయనిస్తున్నట్లేనని మరో న్యాయమూర్తి చంద్రచూడ్‌ అన్నారు. ఎస్‌ఎంసీహెచ్‌ ద్వారా ప్రజల వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఈమెయిల్‌ సందేశాలపై ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.