సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో షాకు ఊరట

ట్రయల్‌ కోర్టు తీర్పుపై దాఖలైన పిల్‌ కొట్టివేత

ముంబై,నవంబర్‌2(జ‌నంసాక్షి): సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పిస్తూ ట్రయల్‌ కోర్టు 2014లో ఇచ్చిన తీర్పును సవాలు చేయరాదని సీబీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీబీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను బోంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. పిటిషన్‌లో కోరిన ఉపశమనాన్ని మంజూరు చేయడానికి కోర్టు మొగ్గు చూపదని జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ భారతి డంగ్రే డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. కేసు నుంచి అమిత్‌ షాకు విముక్తి కల్పించడంపై అపీలు చేయరాదని సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ బోంబే లాయర్స్‌ అసోసియేషన్‌ ఈ పిల్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ ఓ సంస్థ అని, ఈ కేసులో వాదనలు వినిపించే స్థానిక పరిథి ఆ సంస్థకు లేదని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. సోహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీలను 2005లో గుజరాత్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.