సౌర విద్యుత్‌లో తెలంగాణ భేష్‌


1మెచ్చుకున్న కేంద్రం
గ్రీన్‌హబ్‌కు సాయం చేసేందుకు హామీ హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ రంగంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోందని మెచ్చుకుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్‌హబ్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధనశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇంధనశాఖ అధికారులతో సమావేశమైనప్పుడు ఈమేరకు హామీ ఇచ్చారు. కేంద్ర సంయుక్త కార్యదర్శి తరుణ్‌కపూర్‌ సారథ్యంలోని బృందం శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ పరిస్థితిని సమీక్షించింది. ‘‘2015-16 ఆర్థిక సంవత్సరంలో సౌరవిద్యుత్‌లో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది. సౌరవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 450 మెగావాట్లను దాటుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి మరో 960 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధ్యమే. 2వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతిపాదించిన సౌరవిద్యుత్‌ పార్క్‌కు భూసేకరణ పూర్తవగానే.. బిడ్డింగ్‌ చేపడతాం. వచ్చేనెలలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదిక సిద్ధమవుతుంది. వీటికి తోడు తెలంగాణలో 4వేల మెగావాట్ల పవన విద్యుత్‌కూ అవకాశముంద’’ని అరవింద్‌కుమార్‌ వివరించారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయం సాంకేతిక మద్దతుతో చేపట్టాలనుకుంటున్న గ్రీన్‌హబ్‌ అంకుర ప్రయోగకేంద్రం గురించి కూడా ఆయన కేంద్ర బృందానికి వివరించారు. హరిత ఇంధన నిధి ద్వారా ఈప్రాజెక్టుకు సాయం అందించాలని కోరారు. తొందరగా నివేదిక పంపిస్తే దీనిపై నిర్ణయం తీసుకొని, సాయం చేస్తామని కేంద్ర సంయుక్త కార్యదర్శి తరుణ్‌కపూర్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ దక్షిణమండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి, తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ వీసీ, ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.