స్కూళ్లలో బయోమెట్రిక్ కోసం కసరత్తు
వికారాబాద్,మే4(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు ఈ విధానం వర్తింప చేయనున్నారు. ఈ మేరకు రాష్టీయ్ర మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ)కు కేంద్రం బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయనుంది. వాటిని పాఠశాలల్లో ఏర్పాటు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న నిర్ణయంతో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత లబ్ది చేకూరనుంది. ఒక్కో పాఠశాలకు ఒక బయోమెట్రిక్ వల్ల విద్యార్థుల హాజరు శాతం తప్పకుండా పెరుగుతుందన్నారు. కేవలం ఉన్నత పాఠశాలల్లో మాత్రమే కాకుండా అన్ని పాఠశాల్లో బయోమెట్రిక్ హాజరును ఏర్పాటు చేయడంతో విద్యార్థుల హాజరు శాతం మరింత మెరుగు పడుతుందని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు సైతం క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఒక్కో బయోమెట్రిక్ హాజరు యంత్రానికి రూ.10 వేల చొప్పున ఖర్చు చేయనున్నారు. బయో మెట్రిక్ హాజరు యంత్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలలకు వచ్చేందుకు ఇది దోహదపడుతుంది. రోజూ పాఠశాలలకు విద్యార్థులు రావడం వల్ల మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. చదువులో ప్రతిభ చూపే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ చర్యలు చేపట్టింది. విద్యలో నాణ్యత పెరగాలంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు అత్యంత ప్రధానమైదని భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.