స్టార్టప్ కంపెనీని టేకోవర్ చేసిన ఫ్లిప్‌కార్ట్

బెంగళూరు : డిజిటల్ చెల్లింపులో కొత్త ఒరవడికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన ఫోన్ పే అనే స్టార్టప్ సంస్థను తాము సొంతం చేసుకున్నట్టు  ఫ్లిప్ కార్డ్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు వివరాలు లేకుండానే, వినియోగదారుల యూనిక్ ఐడెంటిటీ,  మొబైల్ ఫోన్ నంబర్ లేదా ఇతర వర్చువల్ చెల్లింపుల చిరునామా ద్వారా  లావాదేవీలకు అనుమతించే ఫోన్ పే అనే ఈ స్టార్టప్ సంస్థను ఫ్లిప్ కార్ట్  టేకోవర్ చేసింది.

డిజిటల్ చెల్లింపుల్లో ఇది చాలా సురక్షితమైందని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ తెలిపారు.  ఫోన్ పే ను  సొంతం చేసుకోవడం ద్వారా  చెల్లింపుల ప్రక్రియలో నూతన ఒరడికి శ్రీకారం చుట్టామన్నారు. ఏప్రిల్ నెలలో తన సేవలను ప్రారంభించాల్సి ఉన్న  ఫోన్ పే సంస్థను విలీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చెల్లింపుల ప్రక్రియతో పోలిస్తే ఇది  అత్యంత సురక్షితమైనది, సులువైనందని బిన్నీ బన్సల్ చెప్పారు. బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారెవరైనా సులభంగా కేవలం వారి మొబైల్ ఫోన్ ఉపయోగించి తక్షణ లావాదేవీలు చేయొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని లక్షలాదిమంది వినియోగదారులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యానికి ఇది దారి తీస్తుందన్నారు.  దీనిపై  ఫోన్ పే సహ సంస్థాపకుడు సమీర్ నిగం కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విలీనంతో తమ పరిధి మరింత విస్తరించనందన్నారు.  ఫోన్ పే టీం  ఫ్లిప్‌కార్ట్ కిందికి వచ్చినా, స్వతంత్ర వ్యాపార విభాగంగా పని చేస్తుందని ఫ్లిప్ కార్ట్  స్పష్టం చేసింది.

కాగా ఈ కామర్స్ రంగానికి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు సమీర్ నిగమ్, రాహుల్ చారి సిటి-ఆధారిత మొబైల్ చెల్లింపుల కోసం ఫోన్ పే సంస్థను స్థాపించారు.  వీరు సహసంస్థాపకులుగా ఉన్న ఈ సంస్థ దేశంలో మొదటి యూనిఫైడ్ చెల్లింపుల ఇంటర్ఫేస్ లకు శ్రీకారం చుట్టింది.