స్టేటస్ కో.. ఒక్కొక్కరికి ఒక్కో “లా”
కోర్టు పరిధిలో ఉన్నా మేడిపల్లిలో అంతా భూ మాయ..!
ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
కార్పొరేటర్ భర్త నన్ను అణగదొక్కుతున్నాడు
తెరాస నాయకుడు మల్లం వెంకటేష్ గౌడ్ ఆవేదన
మేడిపల్లి – జనంసాక్షి
“నాక్కూడా 60 గజాల స్థలం ఉంది. 1997 నుంచి అక్కడే ఉన్నా. ఇప్పుడు నిర్మాణం చేసుకుంటే అడ్డు తలుగుతున్నారు. 14వ డివిజన్ కార్పొరేటర్ భర్త పాశం బుచ్చి యాదవ్ లక్ష రూపాయలు తీసుకున్నాడు. అయినా రాజకీయంగా ఎదుర్కోలేక నా పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి మోసం చేయలేదు. స్టేటస్ కో ఉన్న ఇతరులకు ఒక న్యాయం మాకో న్యాయమా..? వాళ్లకు ఇంటి అనుమతులు ఎలా వచ్చాయి? మా స్థలంలో మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్ వచ్చి చెట్లు పెట్టి వెళ్లారు. అధికారులు కాకుండా బుచ్చి యాదవ్ చెప్తేనే పెడుతున్నామని వారు సమాధానం ఇవ్వడం దేనికి సంకేతం..?” – మల్లం వెంకటేష్ గౌడ్ ఆవేదన ఇది.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మేడిపల్లి మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లం వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు పీర్జాదీగూడలో ఆయన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే… మేడిపల్లిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 62, ప్రయివేటు భూమి సర్వే నెంబర్ 78, 79, 80లో గల స్థలంలో గతంలో దళితులు, గిరిజనులు సాగుచేసుకునేవారు. కాలక్రమేణా సాగు కనుమరుగు కావడం, భూములు ప్లాట్లుగా రూపాంతరం చెందడంతో కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలమా.. ప్రయివేటు స్థలమో కూడా తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ 62, 78, 79, 80లో గల ప్లాట్ నెంబర్ 10లో 333 గజాల స్థలం విషయంలో హైకోర్టులో స్టేటస్ కో డబ్ల్యుపి నెం.19149/2019, 19947/2022 నమోదై ఉంది. దీని ప్రకారం ఆ స్థలాన్ని యథాస్థితిలో ఉంచాలి. కానీ పాశం బుచ్చియాదవ్ ( టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త) ఎ సాయికృష్ణ కలిసి ఇంటి నిర్మాణం చేసి ఏకంగా నెంబర్ (17-78-10) కూడా పొందారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో అసలు ఇంటి నిర్మాణం ఎలా చేపట్టారు? అధికారులు ఇంటి నెంబర్ ఎలా కేటాయించారో ఎవరికీ అంతుచిక్కడం లేదని వాపోయారు. హైకోర్టు స్టేటస్ కో ఉండగా.. లోయర్ కోర్టు కూడా ఏ ఆర్డర్ మంజూరు చేయరాదు. ఒకవేళ స్టేటస్ కో వెకేట్ పిటిషన్ వేసి నిర్మాణం చేపట్టారా..? రాజకీయ నాయకులు, అధికారుల ప్రోద్బలంతో నిర్మాణం జరిగిందా తేలాల్సి ఉంది. ఈ విషయమై మల్లం వెంకటేష్ గౌడ్ స్పందిస్తూ.. ఆర్డర్ కాపీ ఉన్న తర్వాత కోర్టు ధిక్కరణ వర్తించదా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తగు విచారణ జరిపి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ ఉ న్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.
తహసీల్దారు పాత్రపై అనుమానాలు..
మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని ఇతర ప్రభుత్వ భూములలో అరవై గజాల స్థలంలో నిరుపేదలు ఇంటి నిర్మాణం చేపడితే అదో పెద్ద నేరంగా పరిగణిస్తూ ఆగమేఘాలతో వచ్చి నిర్మాణాలు కూల్చివేసే అధికారులకు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జాలు ఎందుకు కనపడడం లేదనే విషయంలో తహసీల్దారు పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో తన తల్లి మల్లం లక్ష్మమ్మ పేరుమీద అరవై గజాల స్థలంలో పట్టా రావడం జరిగిందని, సదరు స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకొని తన భార్య మల్లం నీరజ పేర మార్చుకోని ఇంటి నెంబరు తీసుకుని ప్రతిఏటా పన్నులు చెల్లించామని అన్నారు. అనంతరం ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తుంటే స్థానిక కార్పొరేటర్ భర్త అయిన పాశం బుచ్చి యాదవ్ రూ. లక్ష డిమాండ్ చేయడంతో అతనికి ఇచ్చానని అయినా సంతృప్తి చెందని పాశం బుచ్చి యాదవ్ తనపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి తనకున్న అధికార పలుకుబడితో తనకు వచ్చిన ఇంటి నెంబరును రద్దు చేయించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జొలికి వస్తే మేడిపల్లిలో ఉండకూడదంటూ అనేకసార్లు బెదిరింపుకు పాల్పడినట్లు తెలిపారు. పై స్థలం విషయంలో నా భార్య న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని, ఐనా తన అధికార బలాన్ని ఉపయోగించి కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఏకపక్షంగా మొక్కలు నటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన తాము ఇక్కడ నివాసం ఉండడం ఇష్టం లేని అతను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అధికారులే జోక్యం చేసుకోని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.