స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌

– ఒక్క ఓటు పడకుండానే.. 34 శాతం సీట్లు సొంతం
కోల్‌కతా, జ‌నం సాక్షి ) : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టిస్తున్నది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడకుండా 34.2 శాతం స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 58,692 స్థానాలు ఉండగా.. అందులో 20,076 సీట్లలో ఎవరూ పోటీ చేయడం లేదు. వీటిలో మెజార్టీ స్థానాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లాయి. పంచాయత్‌ సమితి స్థాయిలో మొత్తం 9217 స్థానాలు ఉండగా అందులో 3509 స్థానాల్లో ఎవరూ పోటీ చేయడం లేదు. అటు జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 825 స్థానాలు ఉండగా.. 203 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. గతంలో 2003లో లెఫ్ట్‌ అధికారంలో ఉన్నపుడు 6800 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడా రికార్డు బద్దలైంది. 1978 నుంచి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. మొత్తం 8 ఎన్నికల్లో కలిపి 23185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఒక్క ఎన్నికల్లోనే దాదాపు అదే స్థాయిలో స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. అత్యధికంగా బీర్‌భూమ్‌ జిల్లాలో ఏకగ్రీవాలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 2427 స్థానాలు ఉండగా.. అందులో 1967 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.