స్నహభావంతో పండుగలు జరుపుకోవాలి : డిఎస్పీ

నిజామాబాద్‌, జూలై 19: ప్రస్తుతం రానున్న రంజాన్‌, వినాయకచవితి పండుగలను దృష్టిలో పెట్టుకుని అందరూ సామరస్యంగా పండుగలను నిర్వహించుకోవాలని గురువారం ఆర్యనగర్‌ నుండి శాంతి బైక్‌ ర్యాలీని డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్బంగా డిఎస్పీ రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ రానున్న రంజాన్‌, వినాయకచవితి పండుగలను శాంతియుతంగా సామరస్యంగా, స్నేహభావంతో ఉత్సవాలను, పండుగలను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీ సమావేశాలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అన్ని మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని ఆయన తెలిపారు. డిఎస్పీ అందించిన సలహా, సూచనలకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. బైక్‌ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో నగర సిఐ సైదులు, ఫోర్త్‌ టౌన్‌ ఎస్సైలు చంద్రశేఖర్‌, జహంగీర్‌లు, అన్ని మతాల పెద్దలు బైక్‌ర్యాలీలో పాల్గొన్నారు.