స్నేక్‌ గ్యాంగ్‌ అకృత్యాలను ఆటకట్టించిన పోలీసులకు సలామ్‌

స్నేక్‌గ్యాంగ్‌..కర్కశత్వానికి , రాక్షస కృత్యాలకు పెట్టింది పేరు. ఎందరో అభాగ్యులు వీరి అకృత్యాలకు బలయ్యారు. కొందరు మానాలు పోగొట్టుకుంటే కొందరు ధనాన్ని పోగొట్టుకున్నారు. మనకు తెలియకుండా వీరి అకృత్యాల కారణంగా కొందరు బలైపోయివుంటారు. మదమెక్కిన పందుల్లా తయారైన కొందరు విచ్చలవిడిగా తిరుగుతూ ఓ గ్యాంగ్‌గా తయారై అమాయకులను వేధించుకుతిన్నారు. పాములను చేతపట్టి ఒంటరిగానో, జంటగానో కనిపించిన వారినందరినీ తమ అకృత్యాలకు బలి చేశారు. పాములను వారిపైకి వదిలి వలువలు ఊడ్చారు. అమాయకులైన అమ్మాయిలను తమ కామదాహానికి బలి చేశారు. రజాకర్ల చేష్టలను తలపించేలా ఆడవాళ్లను నగ్నంగా నిలబెట్టి ఆడించి ఎంజాయ్‌ చేశారు. అంతేనా అంటే వారిని సామూహిక అత్యాచారాలకు గురి చేసి సర్వనాశనం చేశారు.  అడ్డం వచ్చినవారిని చితకబాది వారి వద్ద ఉన్న సొత్తును దోచుకున్నారు. ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న ఈ వికృత రాక్షసక్రీడకు ఎందరు అమాయకులు  బలయ్యారో చెప్పడం కష్టం. నగరనడిబొడ్డున ఇలాంటి ఘాతుకాలు జరగడానికి చట్టమంటే భయం లేకపోవడమే కారణం. చట్టమంటే భయముంటే, తమను ఎవరైన ఏమైనా చేస్తారేమో అన్న భయం లేని రౌడీ మూకలు ఇలా ఎందరినో కాల్చుకుతిన్నారు. పురాణాల్లో రాక్షసులు కూడా ఇంత నీచంగా వ్యవహరించి ఉండరు. రజాకార్లు మాత్రమే తెలంగాణలో ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మలను ఆడించి, వారిని సామూహిక అత్యాచారాలకు గురిచేశారు. ఎందరో మహిళల మానప్రాణాలను దోచారు. రజాకార్ల వారసులుగా కొందరు స్నేక్‌ గ్యాంగ్‌గా తయారై ఆనాటి ఘటనలు తలపించారు. కానీ పాపం పండింది. ఏనాటికైనా భగవంతుడు వారికి శిక్షవేయక తప్పదని నిరూపించాడు. ఆలస్యం అయినా ఈ నయా రజాకార్ల మూఠాకు జీవిత ఖైదు పడింది. వీరి ఆగడాలను ఆరాతీసి బోనుముందు నిలబెట్టిన, అందుకు  కృషి చేసిన పోలీసులకు హాట్సాఫ్‌. స్నేక్‌గ్యాంగ్‌లో ఏడుగురికి యావజ్జీవశిక్షంగా చెప్పుకోవాలి. సైబరాబాద్‌ పోలీసులు సాక్ష్యాలు సేకరించేందుకు పడ్డ శ్రమ అంతాఇంతా కాదు. ఇందుకు తన టీమ్‌ను నడిపిన  సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సదా అభినందనీయుడు. ఆయన వచ్చిన తరవాతనే నగరం చుట్టుపక్కల ఇలాంటి గ్యాంగులకు వణుకు పుట్టించారు. అందుకే మహిళలను, భూయజమానులను వేధింపులకు గురిచేసే రౌడీమూకలకు ఈ తీర్పు సరైన సందేశాన్ని పంపిస్తుందని కమిషన్‌ సివి ఆనంద్‌ పేర్కొన్నారు. తనకు జరిగిన అఘాయిత్యం గురించి న్యాయస్థానంలో బాధితురాలు చెప్పకపోవడం వల్లే అత్యాచారం అభియోగం రుజువు కాలేదని, దీనిపై అప్పీలుకు వెళ్లే విషయంలో న్యాయసలహా తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ ఆనంద్‌ పేర్కొన్నట్లు అత్యాచారనికి గురైన అమ్మాయి ధైర్యంగా నిలబడాలి. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు నిలబడి ధైర్యంగా ముందుకు రాకపోతే ఇలాంటి గ్యాంగుల ఆటకట్టించలేం. అయితే పోలీసుల కృషిని ఎంతగా చెప్పుకున్నా, పొగిడినా తక్కువే. గతంలో ఓ టెక్కీని సైబరాబాద్‌ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెల్లి అత్యాచారం చేసిన ఘటనలోనూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ చూపిన తెగువ అమోఘం. ఆయన చేసిన కృషి కారణంగా రేప్‌ చేసిన డ్రైవర్‌, అతడి సహాయకుడు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. షీ టీమ్స్‌ వచ్చిన తరవాత కూడా అఘాయిత్యాలకు తెరపడింది. ఇప్పుడు తాజాగా స్నేక్‌ గ్యాంగ్‌ ఆగడాలను కూడా కోర్టులో రుజువు చేసేవరకు విశ్రమించ కుండా పోరాడిన ఆనంద్‌ టీమ్‌ అభినందీనయులు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ప్రేమ జంటపై దాడి చేసిన స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురు నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు, ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున జరిమానా విధించే వరకు వారు పడ్డ శ్రమ అద్భుతం.  ఎనిమిదో నిందితుడికి మాత్రం 20 మాసాల సాధారణ జైలు శిక్ష ఖరారు చేసింది. 2014 జులై 31న నగర శివారులో పహాడీషరీఫ్‌ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లోకి తొమ్మిది మంది స్నేక్‌గ్యాంగ్‌ ముఠా సభ్యులు చొరబడి ప్రేమికులపై దాడి చేసి యువతిని పాముతో బెదిరించిన కేసులో ఎనిమిది మంది నిందితులను కోర్టు దోషులుగా తేల్చింది. 9వ నిందితుడు సాలం హందీని కోర్టు నిర్దోషిగా నిర్ధారించింది. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా రెండో ప్రత్యేక మహిళా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వి.వరప్రసాద్‌ బుధవారం నిందితులకు ఆయా అభియోగాల కింద శిక్ష ఖరారు చేశారు. ఫైజల్‌ దయాని, ఖాదర్‌ బరక్బా, తయ్యద్‌ బాసలమా, మహ్మద్‌ పర్వేజ్‌, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌, మహ్మద్‌ ఇబ్రాహీంలకు జీవిత ఖైదు విధించగా అలీ బరక్బాకు 20 మాసాల జైలు శిక్ష పడింది. నిందితులపై నిరూపితమైన అన్ని అభియోగాలపై న్యాయమూర్తి గరిష్ఠంగా శిక్షలు విధించారు. నిజంగా కోర్టు కూడా పోలీసలు సాక్ష్యాలను పరిశీలించి కఠిన శిక్షలు అమలు చేసింది. నిందితులపై మోపిన అభియోగాలు రుజువైనందున వారికి గరిష్ఠంగా శిక్ష విధించాలని అదనపు పీపీ కోర్టును అభ్యర్థించారు. అనంతరం నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ప్రధాన నిందితుడు ఫైజల్‌ దయానిపై గతంలో ఒక్క క్రిమినల్‌ కేసు కూడా నమోదు కాలేదని, సంఘటన జరిగిన నాలుగు నెలల ముందే భారత్‌ వచ్చాడని చెప్పి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాడు. మిగితా నిందితులు యువకులని పేర్కొంటూ ఉదార స్వభావంతో తీర్పు ఇవ్వాలని అభ్యర్థించారు. నిజానికి ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉదార స్వభావులుగా గుర్తించనందుకు న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మహిళను వివస్త్రను చేయడం, పాములతో బెదిరించి ఫొటోలు తీయడం హేయమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. మహిళలపై జరిగే అకృత్యాల కేసుల్లో కోర్టులు ఉదారంగా ఉండలేవని స్పష్టం చేసింది.ఈ తీర్పు నేరగాళ్లకు కనువిప్పు కావాలి. ఇంతకన్నా గోరమైన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించుకోవాలి. అప్పుడే నయారజాకర్లకు భయం పుడుతుంది. ఆడవారి మానప్రాణాలకు రక్షణ ఉంటుంది.