స్పాట్ బిల్లుల ఆపరేటర్లు విధులకు హాజరు
ఆదిలాబాద్, జూన్ 5 (జనంసాక్షి): గత 25 రోజులుగా తమ డిమాండ్ల కోసం విద్యుత్ స్పాట్ బిల్లుల ఆపరేటర్లు చేపట్టిన సమ్మె యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంతో సమ్మెను విరమించి మంగళవారం నుంచి విధులకు హాజరయ్యారు. ఈటిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని పనికి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్లతో గత నెల 16 నుంచి ఆపరేటర్లు నిరవధిక సమ్మెను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వీరు చేపట్టిన సమ్మె వల్ల స్పాట్ బిల్లులు ఆగిపోయి విద్యుత్ శాఖకు బిల్లుల వసూలు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని మొండికేసిన ఆపరేటర్లతో యాజమాన్యం చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరిస్తామని ఒప్పందం కుదరడంతో సమ్మెను విరమించి మంగళవారం నుంచి ఆపరేటర్లు విధుల్లో చేరారు. యాజమాన్యం తమ డిమాండ్లను ఒప్పుకోవడంతో విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులకు ఆపరేటర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.