స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ సీఎం అభ్యంతరం

న్యూఢిల్లీ: ఇండియా గేట్‌ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా గేట్‌ కాంప్లెక్స్‌ వద్ద స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరికిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ, హోంమంత్రి షిండే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌లకు ఢిల్లీ సీఎం విడివిడిగా లేఖలు రాశారు. స్మారక చిహ్నం ఏర్పాటువల్ల ఇండియా గేట్‌ సందర్శన కోసం సందర్శకులకు నిబంధనల పేరుతో  ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె పేర్కొన్నారు. స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ఇతర ప్రాంతాలను పరిశీలించాల్సిందిగా కోరారు. ఆగస్టులో ఆంటోనీ నేతృత్వంలోని  కమిటీ ఇండియా గేట్‌కు సమీపంలోని ప్రిన్సెన్‌ పార్క్‌లో జాతీయ యుద్ద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.