స్మార్ట్‌ సిటీలకు సహకరిస్తాం

C

– మోదీతో ప్రీతిపటేల్‌ భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 13(జనంసాక్షి):స్మార్ట్‌ సిటీ అమరావతి అభివృద్ధికి సహకరిస్తామని బ్రిటన్‌ మరోమారు భరోసా ఇచ్చింది. అమరావతితో పాటు ఇతర స్మార్ట్‌ సిటీలుగా రూపొందనున్న పూణే, ఇండోర్‌ నగరాలకు కూడా సహకరిస్తామని బ్రిటన్‌ అంతర్జాతీయ అభివృద్ది సెక్రటరీ ప్రీతి పటేల్‌ చెప్పారు. భారత్‌లో పర్యటిస్తోన్న ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శనివారం సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.  మోదీని కలువడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. భారత్‌-బ్రిటన్‌ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి తాను ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణల ఎజెండాకు బ్రిటన్‌ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. భారత్‌లోని పెద్ద ప్రాజెక్టులకు లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో బాండ్‌లు జారీచేయడం ద్వారా లండన్‌ నగరం ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ప్రీతి పటేల్‌ చెప్పారు. రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై లోతుగా చర్చించారు. భారత్‌లో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా సహకరిస్తామని చెప్పారు. మోదీ సర్కారు చేపట్టిన ఆర్ధిక సంస్కరణల అజెండాకు బ్రిటన్‌ మద్దతు ఇస్తుందన్నారు.  పుణె, ఇండోర్‌, అమరావతి నగరాల్లో స్మార్ట్‌సిటీల అభివృద్ధికి మద్దతునిస్తామని తమ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని  ప్రీతి పటేల్‌ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల అభివృద్ధి విషయమై భారత్‌-బ్రిటన్‌ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. ఆదివారం బోఫాల్‌లో పర్యటించి మధ్యప్రదేశ్‌ సీఎంతో భేటీ అవుతానని, ఈ భేటీలో పట్టణాభివృద్ధి గురించి చర్చిస్తామని ఆమె తెలిపారు. ఉగ్రవాద నిరోధం విషయంలో భారత్‌-బ్రిటన్‌ భుజంభుజం కలిపి ముందుకుసాగుతున్నాయన్నారు.