స్మార్ట్ సిటీగా కరీంనగర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ లో భాగంగా మరో 30 స్మార్ట్ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన స్మార్ట్ నగరాల జాబితాను శుక్రవారం జూన్(23) విడుదల చేశారు. ఈ లిస్టులో కేరళ రాజధాని తిరువనంతపురం మొదటి స్థానంలో.. ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్ రెండవ స్థానాల్లో నిలిచాయి. కాగా ఏపీ నుంచి అమరావతి, తెలంగాణ నుంచి కరీంనగర్ చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు నుంచి 4 , కేరళ 1, ఉత్తరప్రదేశ్ 3, గుజరాత్ 3, కర్ణాటక 1, ఛత్తీస్‌గఢ్ నుంచి 2 నగరాలకు చోటు దక్కినట్లు తెలిపారు. ఇప్పటి వరకు స్మార్ట్ సిటిస్ జాబితాలో 90 నగరాలు చేరాయి.
దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్‌ను ప్రవేశ పెట్టింది. దానిలో భాగంగా ఇప్పటికే 60 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా ప్రకటించారు. మొత్తం 40 నగరాలకు.. 45 నగరాలు పోటీపడ్డాయనీ… అయితే అందులో 30 నగరాలు చోటు దక్కించుకున్నాయి. మిగిలిన వాటిని మరో విడతలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఈ నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ. 57,393 కోట్లు కేటాయించినట్లు వెంకయ్య తెలిపారు.