స్మిత్‌, వార్నర్‌ లేకున్నా.. ఆసీస్‌ గొప్పే

వీరేంద్ర సెహ్వాగ్‌

 

 

దిల్లీ: ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఈ నెల 21నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడనుంది. దీని తర్వాత డిసెంబర్‌ 6 నుంచి ఇరు జట్లు మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. అయితే బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేని ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపై ఓడించడానికి భారత్‌కిదే సరైన సమయమంటూ చాలామంది వ్యాఖ్యానించారు. అయితే సెహ్వాగ్‌ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. ‘స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఆసీస్‌కు అది పెద్ద విషయమేవిూ కాదు. వాళ్లు లేకపోయినా మిగతా ఆటగాళ్లు తమదైన శైలిలో అదే దూకుడు ప్రదర్శించగలరు. ప్రస్తుతం వారి టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ ఇప్పటికే అక్కడి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వారే. వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకున్నా.. భారతతో జరిగే పోరులో మంచి పోటీనే ఇవ్వగలరు.’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

 

కోహ్లీసేన ప్రదర్శన పై మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎంతటి జట్టునైనా ఓడించగల సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉంది. ఈ మాట నేను ఏడాది నుంచి చెబుతున్నా. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌ల్లోని మొదటి ఇన్నింగ్స్‌ల్లో బ్యాట్‌తో రాణిస్తేనే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి” అని ఈ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు.