స్మృతి ఫేక్‌ డిగ్రీ పై విచారణకు స్వీకరించిన కోర్టు

4
న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి):

నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చుక్కెదురైంది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కేసు విచారించదగినదేనని పాటియాలా కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 28కు వాయిదా వేసింది. ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. ఈసీకి ఆమె సమర్పించిన మూడు అఫిడవిట్లు సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆగస్టు 28న విచారణ జరపనున్నట్లు పేర్కొంది.ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్‌ తరహాలోనే స్మృతి ఇరానీపై ఖాన్‌ అనే జర్నలిస్టు కేసు పెట్టారు. ఆమె నకిలీ సర్టిఫికేట్లు కలిగి ఉన్నారని ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈలోగా ఆఫిడవిట్‌ దాఖలు చేయాలని స్మృతి ఇరానీకి కోర్టు ఆదేశించింది. ఆమె ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేసినప్పుడు విద్యార్హతకు సంబంధించి మూడు విధాలుగా పేర్కొన్నట్లు తెలియవచ్చింది. 2004లో స్మృతి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు 1996లో ఢిల్లీ యూనివర్శిటీలో తాను బిఏ చదివినట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని, 2011 రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీ యూనివర్శిటీలో కరస్పాండెంట్‌ ద్వారా బీ.కాం చేసినట్లు తెలిపారని.. 2014లో రాహుల్‌పై పోటీ చేసినప్పుడు బికాం చదివినట్లు చెప్పారని, తనకు ఏల్‌ వర్శిటీ నుంచి కూడా డిగ్రీ ఉందని ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని విమర్శలు వచ్చాయి. అసలు ఆమె డిగ్రీ చదవలేదని కాంగ్రెస్‌ కొంత కాలంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెపై ఖాన్‌ అనే జర్నలిస్టు కోర్టులో పిటిషన్‌ వేశారు.