స్వచ్ఛత నిరంతర చైతన్య కార్యక్రమం 

స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించినది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పలి. అందువల్లనే మనదేశంలో అనారోగ్యకర వాతావారణం ఎక్కువే. అలాగే వ్యాధుల సంక్రమణ, అంటువ్యాధుల వ్యాప్తి కూడా ఎక్కువే. స్వచ్ఛ భారత్‌ ప్రకటించిన తరవాత దేశంలో కొంత మార్పు గోచరిస్తోంది. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం తొలిసారిగా ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా గ్రామాల్లో జోరుగా దీనిపై శ్రద్ద పెడుతున్నారు. వ్యక్తిగత మరగుదొడ్లు నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాల అమలు నిలిపివేస్తామని హెచ్చరించడం మొదలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం, తెలంగాణలో కళాకారుల ద్వారా ధూమ్‌ధామ్‌లు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తోంది. పరిశుభ్రత లోపించిన కారణంగానే వ్యక్తిగతంగానే గాక పరిసరాల శుభ్రతా లోపించి అతిసారం, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. మురికివాడల వద్ద ఖాళీ ప్రదేశాలు, పొలం ప్రాంతాలు, వూళ్ల శివారు స్థలాలు, రైలు పట్టాల పరిసరాల్లో కాలకృత్యాలు హానికరంగా పరిణమిస్తున్నాయి. అటువంటి అనారోగ్యకర వాతావరణంలో సగటు మనుషులకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఎంత అవసరమో వేరే చెప్పనవసరం లేదు. ఈ అవసరాన్ని గుర్తించారు కాబట్టే, కేరళలో దశాబ్దాల క్రితమే ‘ఇంటింటికీ సెప్టిక్‌ లెట్రిన్‌’ అనేది ఒక విధంగా ఉద్యమస్థాయిలో సాగింది. అదే స్ఫూర్తి ఇతర రాష్టాల్రకీ వ్యాపించాల్సి ఉంది.

పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్లలె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల్లోనే మురుగు నీరు ప్రవహిస్తుండటం.. దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. అనేక అంటురోగాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించు కొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. తద్వారా పంచాయతీలపై ఆర్థిక భారం పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు,సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పారిశుద్య కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. దీనిఇకతోడు పరిశుభ్రతకు సంబంధించిన పనులు తమకు సంబందించినవి కావన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. పరిశుభ్రతా సాధనలో భాగంగా, శౌచాలయ వ్యవస్థపై ఎనలేని కేంద్రం శ్రద్ధ చూపుతోంది. బహిరంగ మలవిసర్జన రహిత ఊళ్లు, ఇంటింటా మరుగుదొడ్లు’ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికి మూడేళ్లు గడిచాయి. గ్రామసీమల్లోని 42 శాతం జనాభాకు నేటికీ మరుగుదొడ్లు కరవైన పరిస్థితిలో, కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వాలూ వాటి నిర్మాణ నిర్వహణల్ని ఓ సవాలుగా భావిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ముఖ్యంగా తెలంగాణలోని మెదక్‌తో సహా ఎనిమిది

జిల్లాల్ని ఓడీఎఫ్‌లుగా ప్రకటించింది. వార్డు కమిటీలు, స్వయంసహాయక సంఘాలు, పట్టణ సమాఖ్యల ఉమ్మడి కృషితో జనగామ అనతికాలంలోనే లక్ష్యం సాధించింది. కూలిపనులు చేసి సంపాదించిన సొమ్ము తో మరుగుదొడ్లు నిర్మించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వాసులు ఇతర ప్రాంతాలవారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 46శాతం ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వివిధ విభాగాలవారితో ప్రచార బృందాల్ని ఏర్పాటుచేసి, మారుమూల గ్రామాలకీ పంపించీ అవగాహన పెంచేందుకు కృషిచేస్తోంది. ఏపీలోని 1410 గ్రామాలు బహిర్భూమి సమస్య నుంచి సంపూర్ణంగా బయట పడ్డాయని కేందప్రభుత్వ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఇదివరకే వెల్లడించింది. మొత్తం 72లక్షల మరుగుదొడ్లు అవసరమైన ఏపీలో ఇప్పటికే 44.1 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి ఏర్పాటుతో పాటు వినియోగమూ ముఖ్యమంటూ వందల సంఖ్యలో సదస్సులు నిర్వహించారు. పాఠశాలల్లో మరుగదొడ్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి ప్రాథమ్యంగా ప్రకటించింది. ప్రభుత్వాల, ప్రజల ఆలోచనా ధోరణిని బట్టే శౌచాలయ నిర్మాణ పక్రియ ముందుకు సాగుతుంది. ఉమ్మడి భాగస్వామ్యమే స్వచ్ఛతను, శుభ్రతను సాకారం చేస్తుంది.అందుకు అనుగుణంగా అవసరమైతే కఠినచర్యలు తీసుకోవాలి. స్వచ్ఛతకు సంబంధించి ప్రజల్లో చైతన్యంతో పాటు కఠిన నిబంధనలు అమల్లోకి రావాలి. దీనిని తప్పనిసరి చేయడం ద్వారానే లక్ష్యం సాధించగలం. ప్రజల్లో నిర్లిప్తత తొలగాలి. పరిశుభ్రత పాటించకపోతే వ్యక్తిగతంగా తమకు, తద్వారా సమాజానికి చేటు జరగుతుందన్న విషయం ప్రచారం చేయాలి. ప్రజలను నిరంతర చైతన్యం చేయడం ద్వారానే సంపూర్ణ స్వచ్ఛత సాధించగలమని గుర్తించాలి.