స్వచ్ఛభారత్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

3

రాష్ట్రపతి ప్రణబ్‌

దిల్లీసెప్టెంబర్‌10(జనంసాక్షి): స్వచ్ఛభారత్‌ను ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తైన సంద ర్భంగా స్వచ్ఛభారత్‌ ప్రచార కర్తలకు రాష్ట్రపతి గురువారం తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ ప్రచారకర్తలు ప్రజల్లో చెయతన్యం కల్గించాలని.. లక్ష్యం చేరుకునే వరకు నిత్యం పాల్గొనేలా చేయాలని సూచించారు.2019 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలషించారు. మానవ మనుగడలో పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని గాంధీజీ చెప్పారన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు.

స్వచ్ఛభారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలి: వెంకయ్యనాయుడు

స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రచారకర్తలు     మరింత ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రచారకర్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019 అక్టోబర్‌ 2 నాటికి స్వచ్ఛభారత్‌ లక్ష్యం చేరుకోవాలన్నారు. ఇది కొంచెం అసాధ్యమైనా తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదన్నారు. స్వచ్ఛభారత్‌లో ఇప్పటికే 4లక్షలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం లేకుండా పరిపూర్ణ భారత్‌ సాధ్యం కాదని గాంధీజీ చెప్పిన మాటను ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా విజయవంతం కాలేదని వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో మీడియా కృషి అభినందించదగ్గదని కొనియాడారు.