స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగు పడకపోతే చర్యలు
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఖైరతాబాద్ : ఆగస్టు 29 (జనం సాక్షి) స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగు పడకపోతే చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ప్రధాన క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ ఆటోల పనితీరును సంబంధిత అధికారులతో స్వచ్ఛ ఆటోల లబ్ధిదారులతో మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఉద్దేశంతో జిహెచ్ఎంసి గ్యారెంటీతో బ్యాంకులోన్లు ఇప్పించడం జరిగిందని, కొందరు లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఇష్టమైన రీతిలో వ్యవహరిస్తున్నందున వారి పనితీరును మార్చుకోని పక్షంలో అట్టి ఆటోలు ఇతర నిరుద్యోగ యువకులకు కేటాయింపు చేయడం జరుగుతుందని మేయర్ హెచ్చరించారు. ఒక్కొక్క స్వచ్ఛ ఆటో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ నిర్దేశించిన సేకరణ పూర్తిగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం 6 నుండి 11 గంటల వరకు తప్పనిసరిగా కేటాయించిన కాలనీలో వ్యర్థాల సేకరణ పూర్తి చేసిన తర్వాతనే కాలనీ నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. కేటాయించిన వార్డులో కాకుండా ఇతర వార్డులలో కొందరు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరుగుతున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారని, ఇకనుండి అలాంటి పునరావృతం కావద్దని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు కూడా స్వచ్ఛ ఆటో ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.నిర్దేశించిన సమయంలో కాలనీలో సేకరణ చేయని పక్షంలో గాని, స్వచ్ఛ ఆటో డిజైన్ మార్చిన, ఇంటింటి నుండి నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేసినా కఠిన చర్యలతో పాటుగా కేటాయించిన ఆటోను ఇతర నిరుద్యోగ యువతకు కేటాయింపు చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
