స్వచ్ఛ హైదరాబాద్‌పై కీలక నిర్ణయాలు
– సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్,జూన్20(జనంసాక్షి):
స్వచ్ఛ హైదరాబాద్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. మంత్రులు, శాసనసభ్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దిల్లీ నాగపూర్ పర్యటన అనుభవాలను నగర శాసనసభ్యులు సమీక్షలో సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మురుగునీటిని 2 సార్లు శుద్ధి చేయడం వల్ల తిరిగి వాడుకునే వీలుందన్నారు. నల్లాల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు, నాలాలు-మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కూరగాయలు, మాంసాహారం, చేపల మార్కెట్లు, వధశాలలు, నగరంలో అవసరమని పేర్కొన్నారు. నగరంలో మల్టీలెవెల్ పార్కింగ్ స్థలాలు నిర్మించాల్సి ఉందన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ పై జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశం జరిగింది. ఢిల్లీ, నాగపూర్ నగరాల్లో ఇటీవల పర్యటించి వచ్చిన ప్రజా ప్రతినిధుల తరఫున ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యే లక్ష్మణ్ తమ అనుభవాలను వివరించారు. ఈ రెండు నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణకు అవలంభిస్తున్న పద్ధతులను చెప్పారు.
భవన నిర్మాణాలు, కూల్చివేతల సందర్భంగా ఏర్పడే వ్యర్థాలను క్రమపద్ధతిలో సేకరించడంతో పాటు, వాటిని తిరిగి ఉపయోగించాలని సమావేశం నిర్ణయించింది. చెత్త సేకరణ పనిని ఇతర సంస్థలకు అప్పగించకుండా జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలోనే జరపాలని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. శిథిలాల తొలగింపు, వ్యర్థాల తొలగింపు, చెత్త సేకరణ తదితర అంశాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రజాప్రతినిధుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో 200 మోడల్ మార్కెట్లు, 50 మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు, 175 బస్ బేలు, 50 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్, 36 గ్రేవ్ యార్డులు, 36 చెరువుల ఆధునీకరణ, సుందరీకరణ, 2 లక్షల ఇండ్లు, 18 దోబీ ఘాట్స్, 150 పార్కుల అభివృద్ధి, 1000 ప్లే గ్రౌండ్స్ అభివృద్ది, 1000 జిమ్స్ అభివృద్ది, 1000 ఇ.లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా వీటి నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 77 నాలాల నిర్వహణ, మురికి నీటి కాల్వల నిర్వహణపై ప్రజా ప్రతినిధుల సబ్ కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం యధాతథంగా స్వీకరించి, చర్యలు తీసుకుంటుందన్నారు. మురికి నీరు, సబ్బులు, షాంపులు, సర్ఫ్ లు అన్నీ మూసి నదిలోనే కలుస్తున్నాయి. ఆ మలినమైన నీటిని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందని సిఎం కేసిఆర్ అన్నారు. ఆ నీటిని రెండుసార్లు శుభ్రపరిస్తే వాడడానికి వీలవుతుందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 700 మిలియన్ లీటర్ల సీవరేజిని ట్రీట్ చేయగలుగుతున్నామని, మరో 600 ఎంసీడిలు ట్రీట్ చేయగలిగితే మూసీని శుభ్రమైన నీటితో ప్రవహించేలా చేయవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడానికి ఏమి చేయాలనే విషయంపై కూడా కమిటీని నియమించాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీవరేజి, మంచినీరు, నాలాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కూరగాయల మార్కెట్స్, మాంసాహార మార్కెట్స్, చేపల మార్కెట్లు, వధశాలలు నగరంలో చాలా కావాలని సీఎం కేసీఆర్ చెప్పారు. చెత్త వేయడానికి, మార్కెట్లు నిర్మించడానికి స్థలం సేకరించాలని అధికారులకు సూచించారు. నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. వీటిపై కమిటీలు వేయాలని, వాటి నివేదికల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు.
ప్రజాప్రతినిధులతో ఇప్పటికే నియమించిన కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ, నాగపూర్ పర్యటనల తర్వాత వచ్చిన అనుభవాలను కూడా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఐదు జోన్లు ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచాలనీ, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని, సఫాయి కర్మచారుల జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
మంచినీటి సరఫరా, నాలాల నిర్వహణ, చెత్త సేకరణ, శిథిలాల తొలగింపు, సీవరేజి, డంప్ యార్డులు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ ఏడు అంశాలపై ఆరు ప్రత్యేక కమిటీలు నియమించుకోవాలని, ఈ కమిటీలు ప్రతివారం సవిూక్ష నిర్వహించుకునీ, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం కూడా ఓ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.
నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్స్ ని జిహెచ్‌ఎంసి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ప్రజలకిచ్చిన హావిూలు అమలు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ నగరానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచినీళ్ల కోసం కోటా ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. నల్లా కనెక్షన్ల కోసం డబ్బులు కట్టిన వారికి వెంటనే కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని అన్ని ముస్లిం ప్రార్థనాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, మసీదు పరిసరాలను శుభ్రం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పనులను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారు.
రాజకీయాలకు అతీతంగా నగరంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అందరం కలిసి అద్భుతంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
రాజకీయాలను పక్కకు పెట్టి అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు నగర అభివృద్ధి కోసం ఒకచోట చేరడం చారిత్రక ఘట్టమని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, ప్రజల్లో ఈ నగరాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనే సంకల్పం కలిగిందన్నారు. ప్రజాప్రతినిధులు మోటివేటర్లుగా వ్యవహరించి ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని అభివృద్ది చేసుకుందామని కోరారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎంవో, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.