స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మధ్యాహ్నం మూడు గంటలకు వేదిక ప్రాంగణం చేరుకున్న సిఎం కి పలువురు
మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం  స్వీకరించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన చేశారు.

వేదిక వద్దకు చేరుకున్న సిఎం , వేదిక ముందు ఏర్పాటు చేసిన గాంధీ మహాత్ముడి విగ్రహానికి , భరత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాల వీక్షణం కోసం ఆసీనులైనారు.

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ముందుగా.. రాష్ట్ర సమాచార శాఖ, వారోత్సవాల ముగింపు సందర్భంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వీక్షించారు.

అనంతరం.. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి..అదిగో చూడండి’ అంటూ ఆలాపనతో పాటు, ’ఎందరో మహానుభావులూ..అందరీకీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన సభికుల ను ఎంతగానో ఆకట్టుకుంది.

సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రూపొందిన ‘భారతీయ భావన’ అన్న నాట్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. ఇందులో కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సితో పాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన ఇచ్చారు.

ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తెలంగాణ అవతరణం.. తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు , రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒకొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. ఈ నృత్య రూపకం సిఎం కేసీఆర్ దార్శనికతను, రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించింది. సకల జనుల కు అందుతున్న ప్రగతి ఫలాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించింది. భావోద్వేగానికి గురిచేసింది.
అనంతరం ‘ సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట సాగిన పలు వాయిద్యా లతో సాగిన జూగల్బందీ ఆద్యంతం ఆకట్టుకుంది. తబలా ఫ్లూటు ఘటం గిటారా డప్పు తదితర వాయిద్యాలతో కొనసాగిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది.
అనంతరం
మంజుల రామస్వామి బృందంచే ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో కళాకారుల నృత్య భంగిమలు చూపరులను కట్టిపడేశాయి. ప్రేక్షకులు ఈ నృత్య ప్రదర్శనను కళ్లార్పకుండా వీక్షించారు. జయహో అంటూ సాగిన మరో నృత్యం దేశభక్తిని రగిలించింది. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది.

మొత్తంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరతాల ధ్వనులతో ఆద్యంతం సభ మారుమోగింది.

అనంతరం.. సభ ముగింపు దశకు చేరుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందేశాన్ని అందించారు.

గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారం- కె.చంద్రశేఖర్ రావు

గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  స్పష్టం చేశారు. భారత వజ్రోత్సవాలలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర ను, తమ కోసం ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని అన్నారు.
శుక్రవారం హెచ్ఐసీసీ లో జరిగిన స్వాతంత్య భారత వజ్రోత్సవాల ముగింపు సభకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. ముందుగా వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భం విశిష్టమైనదని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనూ ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నామని సీఎం గారు అన్నారు. ముగింపు ఘట్టానికి చేరుకున్నామని, ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.

వజ్రోత్సవాల సందర్భంగా 30 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని . వారికి అభినందనలు తెలిపారు.

భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లని అన్నారు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదని సీఎం కొనియాడారు.

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని, అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారన్నారు. స్వామి వివేకానంద భారత దేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలిందని తెలిపారు.

బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారని, విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద స్వాతంత్ర సమరం నిలబెట్టిందని తెలిపారు. ఆనాడు మహత్మాగాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమకోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పారని సీఎం గుర్తు చేశారు. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యులని కొనియాడారు. యుద్ధాలతో కొట్టుకుచస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం గాంధీ పరిచయం చేశాడని అన్నారు.

గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయిందని, ‘‘ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ ’’ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదమన్నారు. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని అన్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచిందని, గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా గాంధీజీ గురించి గొప్ప విషయాలు చెప్పారని సీఎం అన్నారు. “నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహత్మాగాంధీ యొక్క స్థాయిని నేనెన్నటికీ అందుకోలేకపోయానని, గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని..” అని మండేలా చెప్పుకున్నారని గుర్తు చేశారు. నేటికీ యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నదని, గాంధీ చూపిన అహింసామార్గంలో స్వాతంత్రోద్యమం విజయతీరం చేరిందని తెలిపారు.

రెండు శతాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు ధారపోయాల్సి వచ్చింది. ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చిందని అన్నారు. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని చెప్పారు.
‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను’’ అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపారు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం తెలిపారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నదని అభిప్రాయపడ్డారు.

గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని, పోరాటం గమ్యాన్ని ముద్దాడిందని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేదని, టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని స్పష్టంగా ప్రకటించానని పునరుద్ఘాటించారు. మొదట కొందరు ఏకీభవించలేదు. కానీ రానురాను అందరూ తాను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి వెంట నడిచారని తెలిపారు.

ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసామార్గాన్ని వీడకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచనని వెల్లడించారు.

స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు… తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారని, వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. విచిత్రం ఏమిటంటే… వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనది అయినట్టే.. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణమైనదని స్పష్టం చేశారు.

స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా స్వరాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించామని అన్నారు. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్ళలో వెలుగులు చూస్తున్నామని అన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయంపోషకత్వం దిశగా ఎంతో దూరం ప్రయాణించామని, గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమివ్వడం వల్ల గ్రామాలు సుసంపన్నంగా మారాయని వెల్లడించారు. ప్రజలందరికీ మంచినీళ్ళు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

 

సంక్షేమానికి అగ్ర తాంబూలమివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ఉన్నదని సీఎం గారు తెలిపారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ పదే పదే చెప్పారని, ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా, వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మొదలుకొని… అగ్రవర్ణ పేదలదాకా అన్నిటికీ, అందరికీ సమప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.

సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి నమూనాతో పురోగమిస్తున్నామని, అందుకే ఈరోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. ఈ అభివృద్ధి నమూనా ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని సవినయంగా తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు.

మనది న్యాయపథం.. మనది ధర్మపథం ,సకలజనుల సంక్షేమమే మనకు సమ్మతం
సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని సీఎం అన్నారు. మన నిబద్ధతా, నిజాయితీ జనావళికి అభయమని, ముమ్మాటికి మనలనే విజయం వరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుగారు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తథ్యం…స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నిజంచేద్దాం, జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం. యతో ధర్మస్తతో జయ జై తెలంగాణ.. జై భారత్’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం జాతీయ గీతాలాపన కార్యక్రమంతో సమావేశం ముగిసింది

కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు, సహా..
మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకిరణ్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, జి జగదీష్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సిఎం ఓ అధికార్లు, ప్రభుత్వ సలహాదారు లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ఎ ఐ ఎస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు