స్వదేశీ పరిజ్ఞానంతో మనం వృద్ధి సాధించలేం

ఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి
దేశానికి ఇది పరీక్షా సమయం : ప్రధాని
ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ప్రధాని సభలో అంగి చింపుకొని ఓ వ్యక్తి నిరసన
శ్రీఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి
శ్రీదేశానికి ఇది పరీక్ష సమయం : ప్రధాని
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 22(జనంసాక్షి): ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానం, వనరులతో దేశాభివృద్ధి సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. సైబర్‌ నేరాలు, ఉగ్రవాదంతో దేశం కొత్త సవాళ్లు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఇది పరీక్షా సమయమని ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆసియా దేశాల్లో ఆర్థికాభివృద్ధిపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సంస్కరణలపై సానుకూలంగా స్పందించండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో పోటీ పడాలంటే ససంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. 1991 నాటి సంస్కరణలే దేశాభివృద్ధీకి కీలక మలుపు అని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని స్పష్టం చేశారు. జాతిపితి మహాత్మాగాంధీ మార్గనిర్దేశాల మేరకు నడుస్తామని, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ఆకాంక్షించిన నవభారత నిర్మాణానికి పాటు పడతామన్నారు. వ్యవసాయ రంగాన్ని తయారీరంగానికి బదలాయించే అంశంపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలను సమన్వయం చేసుకుంటూ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇది పరీక్షా సమయమని ప్రధాని వ్యాఖ్యానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అందుకు తగిన వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధత్యప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నాటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆసియా ప్రాంతం అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. వివిధ వర్గాలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ప్రైవేట్‌ రంగం అభివృద్ధికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. మంచి పాలనతోనే మంచి ఆర్థిక వ్యవస్థను చూడగలమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే కంపెనీల నూతన బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కార్పొరేట్‌ చట్టాలను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ‘ప్రపంచ మదుపరుల ఆకాంక్షలకు అనుగుణంగా స్టాక్‌ ఎక్స్ఛేంచ్‌ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్‌, ఆర్థికరంగాల్లో నిలకడ కొనసాగాలంటే అది తప్పనసరి’ అని అన్నారు. విదేశీ పెట్టుబడిదారులను రక్షించేందుకే నూతన చట్టాలు తీసుకువస్తున్నారన్న వ్యాఖ్యలను ప్రధాని కొట్టిపడేశారు. విదేశీ పెట్టబడిదారులతో పాటు మన వినియోగదారులు, రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే సంస్కరణలు తెర లేపినట్లు చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే నూతన చట్టాలను రూపొందిస్తున్నామని తెలిపారు. అమెరికా చట్టాలను భారత్‌లో ప్రవేశపెడుతున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను తప్పుబట్టారు.