స్వరం పెంచిన దినకరన్‌

దిగిపోవాలని సీఎం పళనికి హెచ్చరిక

చెన్నై,ఆగస్టు30  : అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ రోజు రోజుకీ తన స్వరాన్ని పెంచుతున్నారు. తాజాగా బుధవారం ఏకంగా సీఎం పళని స్వామికే వార్నింగ్‌ ఇచ్చారు. రిస్టార్టులో ఉన్న ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది తనకు ఉందని సీఎం పదవి నుంచి దిగిపోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా తనకు మద్దతిచ్చే వారిని స్లీపర్‌ సెల్స్‌ గా దినకరన్‌ అభివర్ణించడం గమనార్హం. ఏఐఏడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేసే హక్కు ఒక్క శశికళకే ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. పళని, పన్నీరు ఏర్పాటుచేయనున్న సమావేశం చట్ట విరుద్ధమని దినకరన్‌ అన్నారు. పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా ఉన్న దినకరన్‌ను శశికళ జైలుకెళ్లగానే పళని వర్గం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇక సర్వ సభ్య సమావేశంలో పళని, పన్నీరు వర్గాలు శశికళ, దినకరన్‌ లను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దినకరన్‌ ఏకంగా హెచ్చరిక స్థాయిలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న దినకరన్‌ 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో ఉంచారు. నేడో రేపో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.