స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్తి మృతి
నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన
హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): నగరంలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి వద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్థి మృతి చెందాడు. మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఏ టూ జెడ్ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోడానికి వచ్చి నీటి మునిగి మృత్యువాత పడ్డాడు. అయితే స్విమ్మింగ్ పూల్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లో కోచ్ లేకపోవడం, సరైన నిర్వహణ లేని కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు ఆడుకున్న తమ కుమారుడు విగత జీవిలా మారడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో కోచ్, సరైన నిర్వహణ లేని కారణంగానే తమ కుమారుడు చనిపోయాడంటూ వారు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. స్విమ్మింగ్ పూల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.