స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల 13న మాలేలోని భారత హై కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి తలదాచుకున్నారు. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్న నషీద్‌ భారత్‌ అక్కడి ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల తర్వాత బయటకు వచ్చారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన కార్యాలయం వెలుపలకి వచ్చి తన మద్దతుదారులతో కలిసి వెళ్లిపోయారు. ఆయన స్వీయ నిర్బంధంతో పెద్ద దిక్కును కోల్పోయిన మాల్దీవియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఊపిరిపీల్చుకుంది. సెప్టెంబర్‌లో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తమవుతామని వారు పేర్కొన్నారు. ఆయన సాధారణ ప్రజాజీవితం గడిపేందుకు తమకు అభ్యంతరం లేదని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది.