స్వేచ్ఛా స్వతంత్య్రాలు కావాలంటే బౌద్ధమే శరణ్యం

4

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి):

స్వేచ్ఛ, స్వాతంత్యం కావాలంటే బుద్ధుని మార్గమే శరణ్యమని,  శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన బాటల్లో నడవడం ద్వారా యుద్ధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్‌ వేడుకలకు హాజరైన మోదీ ముందుగా భూకంపం బారిన పడిన నేపాల్‌ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించారు. అనంతరం రాయబారులు, ఎంపీలు, స్కాలర్లు, బుద్ధ సన్యాసులు కొలువుతీరిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా ఆయన నేపాల్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. దిల్లీలోని తల్కతోరా మైదానంలో బుద్ధపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ… బుద్ధుడు పుట్టిన నేపాల్‌ కష్టాల్లో ఉంది. నేపాల్‌ భూకంప బాధితులకు నివాళులర్పించాల్సిన సమయమిది. నేపాల్‌ ప్రజలు ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని ఆశిస్తున్నట్టు మోదీ చెప్పారు. బుద్ధుడు లేకపోతే … 21వ శతాబ్దం మనది కానే కాదన్నారు. 21వ శతాబ్దం ఆసియాదే… ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించిందన్నారు. సర్వం వదులకుని బుద్ధుడు ఆదర్శంగా నిలిచారని, ధనం, అధికారం సహా అన్నీ వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలన్నారు.  నేడు ప్రత్యేకమైనది.. కానీ కొంత భారమైనది. ఎందుకంటే మనం ఎంతో ప్రేమించే నేపాల్‌ ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. బుద్ధుడు జన్మించిన నేల సంక్లిష్ట దశలో ఉందని, ఈ బాధ నేపాల్‌కు  ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు. ఈ సందర్భంగా నేపాల్‌ ప్రజలు మనోధైర్యంతో భూకంప సంక్షోభాన్ని దాటాలని కోరుకుంటున్నానని అన్నారు. బుద్ధుడు మానవత్వానికి చక్కని సందేశం ఇచ్చాడు. అది నేటికి బతికి ఉంది. యుద్ధం నుంచి అందరికీ విముక్తి లభించాలంటే అది ఒక్క బౌద్ధ మార్గం ద్వారానే సాధ్యమని గుర్తుంచుకోవాలన్నారు. మనలో ఉండే ధైర్యం, డబ్బు, అధికారం, చేసే పని అంతా మానవ కళ్యాణానికి ఉపయోగపడాలనే అనుకోవాలన్నారు. చిన్నవయసులో భోగభాగ్యాలు అనుభవించిన బుద్ధభగవానుడు తిరిగి ప్రపంచంపై దయ చూపించారని బుద్దుడి గురించి వివరించారు. ప్రపంచాన్ని వేధిస్తున్న అన్ని సమస్యలకు సమాధానం బుద్ధిజంలో ఉందని, దానిని అనుసరిస్తే మంచిదన్నారు. నేపాల్‌ భూకంప బాదితుల కన్నీళ్లు తుడవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యమన్నారు.